వనితా తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. 1999లో డైరెక్టర్ కోడి రామకృష్ణ తెరకెక్కించిన దేవి సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది. ఇందులో సుశీల పాత్రలో ఆమె నటించారు. అప్పట్లో ఈ మూవీ ఘన విజయాన్ని అందుకోవడమే కాకుండా.. సుశీల పాత్ర ప్రేక్షకులకు చేరువయ్యింది. అయితే ఈ సినిమా తర్వాత వనితా మరో మూవీలో కనిపించలేదు.
దేవి తర్వాత తమిళంలో పలు చిత్రాల్లో నటించినప్పటికీ అంతగా గుర్తింపు రాలేదు. చాలా కాలం ఇండస్ట్రీకి దూరంగా ఉన్న వనితా.. కొద్ది రోజులుగా ఎక్కువగా వివాదాలతోనే వార్తలలో నిలుస్తున్నారు. తండ్రితో వివాదం.. పెళ్లిళ్లు.. బిగ్ బాస్ షో.. తోటి నటీమణులతో గొడవలతో నిత్యం వార్తలలో నిలిచింది.
ఇక చాలా సంవత్సరాల తర్వాత వనితా విజయ్ కుమార్ మరోసారి టాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. డైరెక్టర్ ఎమ్మెస్ రాజు దర్శకుడిగా తెరకెక్కించిన మళ్లీ పెళ్ళి సినిమాలో నటించారు వనితా.