తిరుమల మార్గంలో నెల్లూరు జిల్లాకు చెందిన లక్షిత అనే చిన్నారిని చిరుత హతమార్చిన ఘటన తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. ఈ ఘటనతో టీటీడీ ఈవో ధర్మారెడ్డి కీలక అధికారులతో సమావేశం ఏర్పాటు చేసారు. పలు నిర్ణయాలు తీసుకున్నారు. అయితే చిరుతపులి పంజాకి బలైన చిన్నారి లక్షిత స్వగ్రామంలో రోదనలు మిన్నంటాయ్!. లక్షిత మృతదేహాన్ని చూసి బంధుమిత్రులంతా తల్లడిల్లిపోయారు!. అంబులెన్స్ లక్షిత ఇంటికి చేరుకోగానే ఏడుపులతో ఆ ప్రాంతమంతా దద్దరిల్లింది.
అయితే, తమ బిడ్డ మృతికి అధికారుల నిర్లక్ష్యమే కారణమంటోంది లక్షిత తల్లి. వెంటనే స్పందించి ఉంటే తమ బిడ్డ ప్రాణాలు పోయేవి కాదని ఆరోపిస్తోంది. అయితే, లక్షిత తల్లిదండ్రుల నిర్లక్ష్యంపై పరోక్షంగా కీలక వ్యాఖ్యలు చేశారు టీటీడీ ఈవో ధర్మారెడ్డి. పిల్లలను జాగ్రత్తగా పెట్టుకోమని అనౌన్స్‌మెంట్స్ ఇస్తూనే ఉన్నామన్నారు. లక్షిత మృతితో టీటీడీ అలర్టైంది. నడక మార్గాల్లో భక్తుల భద్రతను మరింత పటిష్టం చేయాలని నిర్ణయించింది. అలిపిరి దగ్గర మధ్యాహ్నం 2గంటలకు, శ్రీవారి మెట్టు దగ్గర మధ్యాహ్నం 3గంటలకు నడకదారి మూసేసే ప్రతిపాదనలపై ఆలోచన చేస్తోంది టీటీడీ.
తిరుమల నడకదారులను హైఅలర్ట్ జోన్స్‌గా ప్రకటించింది టీటీడీ. ఏడో మైలురాయి నుంచి నరసింహస్వామి ఆలయం వరకు సెక్యూరిటీ డబుల్ చేసింది. ఇకపై ప్రతి 40 అడుగులకు ఒక్కో టీమ్ భక్తుల భద్రతను పర్యవేక్షించనుంది. అంతేకాదు, ఇప్పటివరకు 50మందిని ఒక గుంపుగా పంపితే, ఇప్పట్నుంచి 100మంది ఉంటేనే పంపించనున్నారు. అదనంగా 5వందల సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడంతోపాటు చిరుతను బంధించేందుకు బోన్లు కూడా పెట్టారు అధికారులు.