టమాటా ధరలను బంగారంతో పోల్చాల్సి వస్తుందని ఎప్పుడూ ..ఎవరూ ఊహించి ఉండరు. రూపాయి నుంచి 10రూపాయలకు దొరికే టమాటా ధర అమాంతం ఆకాశాన్ని అంటేసింది. ముఖ్యంగా మన దేశంలోని చాలా రాష్ట్రాల్లో కిలో టమాటా ధర 100రూపాయలు దాటిపోయింది. ఇంకా విచిత్రం ఏమిటంటే..ఉత్తరాఖండ్‌లోని టమాటా ధర మరింత భయపెడుతోంది. అక్కడ కిలో 250రూపాయలకు విక్రయిస్తున్నారు.
ముఖ్యంగా గంగోత్రి ధామ్‌లో టమాటాలు ప్రస్తుతం 250రూపాయలకు కిలో చొప్పున విక్రయించడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. అయితే తమిళనాడులోని ప్రతిపక్ష పార్టీ అన్నాడీఎంకే కార్యదర్శి ఆర్ఎస్ రాజేష్ రూపాయికే కిలో టమాటాలు ఇస్తున్నాడు. ప్రజల బాధలను అర్ధం చేసుకుని వారి పార్టీ తరపున ఒక టన్ను టమోటాలను కొనుగోలు చేశాడు. వాటిని రూ.1 కే కిలో లెక్కన విక్రయించారు. ఈ టమోటాలను ఆర్కే నగర్ నియోజకవర్గంలోని తండయార్ పేట లో 1000 మంది కొనుగోలు చేశారు.
ఆ టమాటలను కొనుగోలు చేసిన ప్రజలు చాలా సంతోషాన్ని వ్యక్తం చేశారు. టమాటా ధరలు ఆకాశానంటిన తరుణంలో ఇలా తక్కువ ధరలో అందించడం సంతోషంగా ఉందని స్థానిక ప్రజలు అంటున్నారు. అలానే టమాటాలను అందించిన అన్నాడీఎంకే నాయకులకు ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు. కాగా పార్టీ కార్యదర్శి అయిన రాజేష్ పళనిస్వామి సూచనల మేరకు ఈ కార్యక్రమం చేసినట్లుగా తెలిపారు. మరి.. రూపాయికే కిలో టమాటాలు ఇవ్వడం పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయిండి.