వంద సంవత్సరాల పైన చరిత్రగల ఈ దేవాలయంలో అమ్మవారి విగ్రహం మొదట్లో భీకరంగా వుండేది. ఆ విగ్రహం 1910 లో వచ్చిన వరదలలో పాక్షికంగా దెబ్బతినటంతో శ్రీ గ్రంధి అప్పారావుచే మలచబడ్డ ఇప్పటి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. ప్రస్తుతం అమ్మవారు కరుణారసమూర్తి. చతుర్భుజ అయిన ఈ తల్లి విగ్రహం 12 అడుగుల ఎత్తు వుంటుంది.
నాలుగు చేతులలో ఖడ్గం, త్రిశూలం, డమరుకం, కలశం వున్నాయి. విశాలమైన కళ్ళతో అత్యంత ఆకర్షణీయంగావుండే ఆ తల్లి కూర్చున్నట్లు వుంటుంది.ఈ తల్లి చల్లని దీవెనలతోనే తమ ప్రాంతం సుభిక్షంగా వుందని అక్కడి ప్రజల విశ్వాసం.ప్రతి సంవత్సరం జనవరి 14నుంచి నెల రోజులపాటు ఇక్కడ ఉత్సవాలు జరుగుతాయి.
విజయవాడకి 103 కిలో మీటర్ల దూరంలో వున్న ఈ వూరికి రాష్ట్రంలోని అనేక ప్రాంతాలనుంచి రైలు, రోడ్డు మార్గాలున్నాయి. సమీప ఎయిర్ పోర్టు విజయవాడ. భీమవరం రైలు స్టేషను నుంచి గుడి 2 కి.మీ.ల లోపే వుటుంది.