గత కొంతకాలంగా తన భర్త మరో మహిళతో సన్నిహితంగా ఉండటం గమనించిన భార్య అతనిపై నిఘా పెట్టింది. కాస్త సమయం తీసుకొని చివరికి వారిని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుంది. సన్నిహితంగా ఉండగానే పట్టుకోవడంతో వారేమీ ఎదురు చెప్పలేకపోయారు. ఇద్దరిని పంచాయితీ పెద్దల ముందుకు తీసుకువెళ్ళింది. అయితే తమను పట్టుకున్నందుకు ఆ ప్రియురాలు భయపడలేదు సరికదా గృహిణికి ఆమె భర్తను అప్పగించాలంటే తనకు అతడు బాకీ పడ్డ రూ.5 లక్షలు చెల్లించాలని షరతు పెట్టింది. దీంతో ఆ ఇల్లాలికి చిర్రెత్తుకొచ్చింది.
కట్టుకున్న భార్యని వదిలి బయట తిరుగుళ్ళు తిరిగే భర్త తనకు అక్కర్లేదని.. ఆ రూ.5లక్షలు తనకే ఇచ్చి అతన్ని దక్కించుకోవాలని ప్రియురాలికి బంపర్ ఆఫర్ ఇచ్చింది. అయితే తెలుగు సినిమా ‘శుభలగ్నం’లో హీరో భార్య చేసినట్టుగా కర్ణాటకలో ఓ మహిళ తన భర్తను రూ.5 లక్షలకు అమ్మేసింది. మండ్య జిల్లాలోని ఓ గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. వివాహేతర సంబంధం పెట్టుకున్న భర్తను భార్య రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకోగా, విషయం గ్రామ పంచాయతీ పెద్దల ముందుకు వెళ్లింది.
తన భర్తను వదిలేయాలని భార్య కోరగా, ‘నీ భర్త నా దగ్గర రూ.5 లక్షలు తీసుకున్నాడు. అదిచ్చేస్తే వదిలేస్తాను’ అని రెండో మహిళ చెప్పింది. ‘మరో 5 లక్షల రూపాయలు నువ్వే నాకు ఇవ్వు. నా భర్తను పూర్తిగా నీకే వదిలేస్తా’నని భార్య చెప్పడంతో అక్కడి వారంతా అవాక్కయ్యారు. రూ.5లక్షలు ఇవ్వడానికి రెండో మహిళ అంగీకరించింది. గ్రామపెద్దలు కూడా ఇందుకు ఓకే చెప్పటంతో, వివాదం ముగిసిందని సమాచారం.