మొబైల్ స్రీన్లపై ఎమర్జెన్సీ వార్నింగ్ మెసేజ్ డిస్‌ప్లేపై మూడు సార్లు ప్రత్యక్షమైంది. అయితే ఈ మెసేజ్ చూసిన వారు ఇక్క సారిగా ఉలిక్కిపడి.. ఏమైందోనని భయాందోళనలకు గురయ్యారు. అయితే, అత్యవసర పరిస్థితుల్లో దేశ వ్యాప్తంగా ఉన్న ప్రజలను ఒకేసారి అలర్ట్ చేసేందుకు ఇలాంటి అలర్ట్ మెసేజ్ టెస్ట్ నిర్వహిస్తున్నట్లు కేంద్ర టెలి కమ్యూ నికేషన్ విభాగం తెలిపింది. అయితే రాబోయే ప్రకృతి విపత్తులను ముందే పసిగట్టి ప్రజలను అప్రమత్తం చేసేందుకు భారత ప్రభుత్వం మొబైల్ ఫోన్లలో కొత్త ఎమర్జెన్సీ అలర్ట్ సిస్టమ్‌ను పరీక్షిస్తోంది.
ఇప్పటికే దేశంలోని పలు ప్రాంతాల్లో చాలా మంది యూజర్లపై సిస్టమ్ పనితీరును టెస్ట్ చేయడం మొదలు పెట్టింది. ఇందులో భాగంగానే యూజర్లకు సెక్యూరిటీ మెసేజ్ అలర్ట్ పంపుతోంది. విపత్తుల గురించి ప్రజలను హెచ్చరించేందుకు యూఎస్, యూకే, ఆస్ట్రేలియా, కెనడా వంటి దేశాలు ఇప్పటికే ఇలాంటి వ్యవస్థను అమల్లోకి తెచ్చాయి. ఇప్పుడు భారత్ కూడా అలాంటి వ్యవస్థనే అమల్లోకి తెచ్చేప్రయత్నం చేస్తోంది.
భూకంపాలు, ఆకస్మిక వరదలు, భారీ వర్షాలు, సునామీలు, ఇతర విపత్తులేమైనా వచ్చినప్పుడు ప్రజలను తక్షణమే అలర్ట్ చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఇలాంటి ఎమర్జెన్సీ అలర్ట్ సిస్టమ్‌ను అభివృద్ధి చేస్తోంది. ఇందులో భాగంగానే భారత ప్రభుత్వానికి చెందిన టెలికమ్యూనికేషణ్ విభాగంలోని సెల్ బ్రాడ్‌కాస్టింగ్ మొబైల్ యూజర్లకు టెస్ట్ మెసేజెస్ పంపుతోంది. ‘ఇది భారత ప్రభుత్వ టెలికమ్యూనికేషన్ విభాగం ద్వారా పంపబడిన నమూనా పరీక్ష సందేశం. దయచేసి ఈ సందేశాన్ని విస్మరించండి. ఎందుకంటే మీ వైపు నుంచి ఎటువంటి చర్య అవసరం లేదు’ అంటూ ఎమర్జెన్సీ అలర్ట్ ద్వారా సందేశం పంపుతోంది.