అభ్యర్దుల ఎంపికలో భాగంగా సీఎం జగన్ కీలక మార్పులు చేస్తున్నారు. గెలుపే ప్రామాణికంగా సామాజిక సమీకరణాలకు ప్రాధాన్యత ఇస్తూ ఎంపిక చేస్తున్నారు. ఒంగోలు పార్లమెంట్ స్థానం నుంచి సిట్టింగ్ ఎంపీ మాగుంట శ్రీనివాసల రెడ్డికి దాదాపు సీటు లేనట్లే. మాజీ మంత్రి బాలినేని ఇప్పటికీ మాగుంటకు సీటు దక్కేలా ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ఏపీలో అధికార వైసీపీ ఆచితూచి రాజకీయ నిర్ణయాలు తీసుకుంటోంది. ఈసారి జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు అవకాశాలు తక్కువగా ఉన్న వారిని పక్కన పెట్టి కొత్త వాళ్లను పోటీకి సిద్ధం చేస్తోంది.
మరికొందర్ని నియోజకవర్గాలు మార్చి కొత్త ప్రయోగానికి శ్రీకారం చుడుతోంది. ఇందులో భాగంగానే నగరి ఎమ్మెల్యే,ఏపీ టూరిజం మంత్రి ఆర్కే రోజాకు ఈసారి టికెట్ ఇవ్వకుండా ..ఆమెను లోక్ సభ ఎన్నికల బరిలో నిలబెట్టాలని వైసీపీ హైకమాండ్ ప్లాన్ చేశారట. ఇందులో భాగంగానే ఒంగోలు లోక్ సభ అయితే బెటర్ అని ఫిక్సయ్యారని సమాచారం. గత ఎన్నికల్లో ఒంగోలు మాగుంట శ్రీనివాసులురెడ్డి వైసీపీ నుంచి గెలుపొందారు. ఒంగోలులో వైసీపీకి బలమైన ఓటు బ్యాంకు ఉంది.
ఆ ధీమాతోనే రోజాను ఇక్కడి నుంచి పోటీకి సిద్దంగా ఉండాలని పార్టీ పెద్దలు ఇప్పటికే చెప్పినట్లుగా సమాచారం. ఒకటి రెండ్రోజుల్లో అధికారిక ప్రకటన కూడా వెలువడే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. రాజమండ్రి వైసీపీ ఎంపీ అభ్యర్ధిగా సుమన్ ను నిలబెట్టడంలో ప్రధానంగా బీసీ ఓటు బ్యాంకును కాపాడుకోవడమే లక్ష్యంగా కనిపిస్తోంది. నటుడు సుమన్ గౌడ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కావడంతో MPగా పోటీ చేస్తే BC ఓట్లు గంపగుత్తగా పడే ఛాన్స్ ఉంటుందని YCP భావిస్తోంది.