భారతీయ హిందూ మతంలో ముఖ్యంగా వైష్ణవ సంప్రదాయంలో రాధ ప్రసిద్ది చెందిన దేవతగా ఆరాధించబడింది. సంస్కృత పదం ‘రాధా’ శ్రేయస్సు, విజయం అని అర్ధం. ప్రేమ, సున్నితత్వం, కరుణ భక్తికి మారుపేరుగా భావిస్తారు. ఆమె శ్రీకృష్ణుని శాశ్వత భార్య, అతనితో వారి శాశ్వత నివాసం గోలోకాధామంలో నివసిస్తుంది.
ఆమె కృష్ణుడి అంతర్గత శక్తి లేదా హ్లాదిని శక్తి ( ఆనంద శక్తి ) గా చెపుతారు. శ్రీ కృష్ణాష్టమి తర్వాత 15 రోజులకు వచ్చే భాద్రపద శుక్ల అష్టమి అనగా ఆంగ్లమాన తేదీ ప్రకారం 04 సెప్టెంబర్ 2022 ఆదివారం రోజున రాధాష్టమి పర్వదినం. ఆమె ఆరాధనకు ఇదొక అపురూప సమయం. లోకంలో పవిత్రమైన ప్రేమకు ప్రతిరూపాలుగా మొట్టమొదట రాధాకృష్ణులనే పేర్కొంటాం.
రాధ అంటే ఎవరో కాదు, సాక్షాత్తు శ్రీకృష్ణుని ఆంతరంగిక శక్తి స్వరూపమే. పరమాత్మ అనేకానేక శక్తులలో రాధాదేవి ఒకరు. చాలా మందికి తెలియని విషయమేమిటంటే, శ్రీకృష్ణ పరమాత్మ కటాక్షాన్ని పొందడానికి అత్యంత దగ్గరి దారి ఆయన హృదయాంశ అయిన రాధమ్మ అనుగ్రహం పొందడమే. హరేకృష్ణ మంత్రంలోని హరే అన్న పదం కూడా ఆమెను సూచించేదే. ఈ మంత్రాన్ని జపించడం ద్వారా రాధాకృష్ణులను ఇద్దరినీ కలిపి ఆరాధిస్తున్నట్టే.