తమిళ సినీ నిర్మాత రవీందర్ చంద్రశేఖర్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆర్ధిక నేరాల కేసులో ఆయన్ను కస్టడీలోకి తీసుకున్నట్టు తెలుస్తోంది. సోషల్ మీడియాలో అప్పుడప్పుడు వైరల్ అవుతుంటాడు రవిందర్. ఈమధ్యే ఆయన పెళ్లి విషయంలో ఇంకా ఫేమస్అయ్యాడు. అయితే కోలీవుడ్ నిర్మాత రవీందర్ చంద్రశేఖర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. చెన్నైకి చెందిన ఓ వ్యాపారవేత్తను ఆయన మోసం చేసినట్లు ఫిర్యాదు అందడంతో, సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు. సదరు వ్యాపారవేత్తకు నకిలీ పత్రాలు చూపించి ఏకంగా రూ.15 కోట్లు చీట్ చేసినట్లు తెలుస్తోంది.
ఫిర్యాదులో పేర్కొన్న వివరాల ప్రకారం.. ఘనవ్యర్థాలు నుంచి విద్యుత్ ఉత్పత్తి చేసే ప్రాజెక్ట్ పెడితే భారీగా లాభాలు వస్తాయని చెన్నైకి చెందిన బాలాజీ అనే ఓ వ్యాపారవేత్తను చంద్రశేఖరన్ నమ్మించారు. కలిసి ప్రాజెక్టు ఏర్పాటు చేద్దామని ఒప్పించారు. ఆయనను నమ్మి సదరు వ్యాపారవేత్త ఒప్పందం కుదుర్చుకున్నారు. 2020 సెప్టెండర్ 17న ఈ ఒప్పందం జరిగింది. ఈ సందర్భంగా పెట్టుబడి కోసం రూ. 15.83 కోట్లు ఇచ్చారు. డబ్బులు తీసుకున్న చంద్రశేఖరన్ ఇప్పటి వరకు ప్రాజెక్టును మొదలు పెట్టలేదు. ప్రాజెక్టు ఎప్పుడు మొదలవుతుందంటే? చూద్దాం, చేద్దాం అంటూ కాలం వెల్లదీస్తున్నారు.
ప్రాజెక్టు వద్దు, ఏం వద్దు ఇచ్చిన డబ్బును తిరిగి ఇవ్వాలని సదరు వ్యాపారవేత్త కోరాడు. ఎన్నిసార్లు అడిగినా డబ్బు ఇవ్వకపోవడంతో బాలాజీ తాజాగా సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్‌లో ఫిర్యాదు చేశారు. బాధితుడి నుంచి ఫిర్యాదు అందుకున్న పోలీసులు విచారణ మొదలు పెట్టారు. అయితే, వ్యాపారవేత్త నుంచి డబ్బులు రాబట్టేందుకు చంద్రశేఖరన్ నకిలీ డాక్యుమెంట్లు చూపించినట్లు ఈ దర్యాప్తులో వెల్లడి అయ్యింది. ఈ నేపథ్యంలో పోలీసులు అతడిని అరెస్టు చేశారు. అనంతరం కోర్టులో ప్రవేశపెట్టారు. కోర్టు చంద్రశేఖరన్ కు జ్యూడీషియల్ కస్టడీ విధించింది.