మేల్కొన్న వెంటనే ప్రజ్ఞాన్ రోవర్ ఏం చూసింది..? అసలేం చేసిందో మీరే చూడండి.

ప్రజ్ఞాన్‌ అంటే సంస్కృతంలో విజ్ఞానం అని అర్థం. స్వదేశీ పరిజ్ఞానంతో దీన్ని రూపొందించారు. ఆరు చక్రాలతో జాబిల్లిపై పరుగులు పెట్టే దీని బరువు 26 కిలోలే. చంద్రుడి ఉపరితలంపై సేకరించే సమాచారాన్ని ఇది ల్యాండర్‌ విక్రమ్‌ సాయంతో భూమికి చేరవేస్తుంది. అయితే తాజాగా ఇస్రో సంస్థ మరో వీడియోని విడుదల చేసింది. ఒక చంటి పిల్లాడు తన తల్లి ముందు ఎలా చిలిపి పనులు చేస్తాడో.. ల్యాండర్ ముందు రోవర్ కూడా అలాగే చేస్తూ ఈ వీడియోలో కనిపించింది. తన చుట్టూ తానే చక్కర్లు కొడుతూ.. సరదాగా ఆడుకుంటుండడాన్ని ఈ వీడియోలో మనం చూడొచ్చు.

ఈ వీడియోని ఇస్రో షేర్ చేస్తూ.. ‘‘సురక్షితమైన మార్గాన్ని ఎంపిక చేసుకోవడంలో భాగంగా ప్రజ్ఞాన్ రోవర్ తన చుట్టూ తానే చక్కర్లు తిరుగుతోంది. ప్రజ్ఞాన్ భ్రమణాన్ని ల్యాండర్ ఇమేజర్ కెమెరా బంధించింది. చందమామ పెరట్లో చిన్న పిల్లాడు (రోవర్) ఉల్లాసంగా ఆడుకుంటుంటే.. తల్లి (ల్యాండర్) ఆప్యాయంగా చూస్తున్నట్లు ఉంది కదూ’’ అంటూ రాసుకొచ్చింది. జాబిల్లిపై కాలు మోపినప్పటి నుంచి తన పరిశోధనల్ని మొదలుపెట్టిన చంద్రయాన్-3 ఇప్పటివరకూ ఎంతో కీలక సమాచారాల్ని భూమికి అందజేసింది. తొలుత అక్కడి ఉష్ణోగ్రత వివరాల్ని భూమికి పంపించింది. అనంతరం మంగళవారం సాయంత్రం రోవర్‌కు ఉన్న ‘లేజర్ ఇండ్యూస్డ్ బ్రేక్‌డౌన్ స్ప్రెక్ట్రోస్కోప్’ (ఎల్ఐబీఎస్) అనే పరికరం చంద్రుడి దక్షిణ ధ్రువంలో సల్ఫర్ ఉన్నట్లు కనుగొంది.

అలాగే.. అల్యూమినియం, కాల్షియం, ఐరన్, క్రోమియం, టైటానియం, సిలికాన్, ఆక్సిజన్‌ల ఉనికిని ప్రజ్ఞాన్ రోవర్ కనుగొందని ఇస్రో ప్రకటించింది. ఇక హైడ్రోజన్ కోసం రోవర్ అన్వేషణ కొనసాగుతోందని పేర్కొంది. మరోవైపు.. చంద్రుడిపై బండరాళ్లు, గుంతలు ఉన్న తరుణంలో రోవర్ సురక్షిత మార్గాల్ని కూడా సక్రమంగా ఎంపిక చేసుకుంటోంది. ఆదివారం నాలుగు మీటర్ల వెడల్పు గల బిలాన్ని మూడు మీటర్ల దూరం నుంచే రోవర్ గుర్తించింది. అప్పుడు ఇస్రో శాస్త్రవేత్తలు వెంటనే అప్రమత్తమై, దిశ మార్చుకోవాల్సిందిగా సూచించడంతో అది మార్గం మళ్లించుకోవడం జరిగింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *