రామారావు ఒకేసారి నాలుగు కేజీలు మాంసం ఆరగించిన సందర్భాలు కూడా ఉన్నాయట. గారెలు డజను, పెసరట్లు అరడజను, మిరపకాయ బజ్జీలు లెక్కలేనన్ని ఒకేసారి తినే అలవాటు కూడా రామారావుకి ఉండేదట. అయితే ఎన్ని ఆహారపదార్థాలు తిన్నా.. ఆయనకు వెంటనే జీర్ణం అయ్యేదట. అంత గొప్ప జీర్ణశక్తి రామారావు కి ఉండటం నిజంగా ఆశ్చర్యం అని చెప్పుకోవచ్చు. అయితే ఆ రోజుల్లో తెల్లవారుజామున షూటింగ్స్ స్టార్ట్ చేసేవాళ్ళు. చెప్పిన సమయానికి ఒక నిమిషం ముందే ఎన్టీఆర్ సెట్స్ లో ఉండేవారట. దీని కోసం ఆయన ఉదయం 3 లేదా 4 గంటలకే నిద్రలేచేవారట.
ఆయన ఆహారపు అలవాట్ల గురించి పచ్చల ప్రకాష్ ఆసక్తికర విషయాలు వెల్లడించారు. పచ్చల ప్రకాష్ ఎన్టీఆర్ ని చాలా దగ్గరగా చూశారు. ఎన్టీఆర్ సినిమాలకు ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ లో ఆయన పని చేశారు. ఎన్టీఆర్ తో ఆయనకు మంచి అనుబంధం ఉందట. నాదేశం మూవీ విడుదలైన తదుపరి ఏడాది ఎన్టీఆర్ సీఎం అయ్యారు. అప్పుడు ఆయనకు భోజనం తయారు చేయించే బాధ్యత నాకు దక్కిందని ప్రకాష్ అన్నారు. ముఖ్యమంత్రి కావడంతో సెక్యూరిటీ రీజన్స్ ఉంటాయి. అందుకే బాగా నమ్మిన నాకు ఆయనకు భోజనం ఏర్పాటు చేసే బాధ్యత ఇచ్చారని ప్రకాష్ వెల్లడించారు.
ఇక ఎన్టీఆర్ దిన చర్య, ఆహారపు అలవాట్లు గురించి చెబుతూ… ఆయనకు ప్రతిరోజూ బ్రేక్ ఫాస్ట్ లో నాటు కోడి ఉండాలి. రాగి జావ, రాగి ముద్దతో ఉదయం ఐదు గంటల లోపే బ్రేక్ ఫాస్ట్ పూర్తి చేస్తారు. మధ్యాహ్నం, రాత్రి భోజనంలో కూడా ఆయనకు నాన్ వెజ్ ఉండాలి. నీచు లేకుండా ఆయన భోజనం చేయరు. మటన్, కొరమేను ఆయనకు బాగా ఇష్టమైన నాన్ వెజ్ ఐటమ్స్. ఎన్టీఆర్ భోజన ప్రియుడు. భోజనంలోకి ఏం కావాలో ముందుగానే ఆర్డర్ వేస్తారు. ఎన్టీఆర్ కోరింది మెనూలో సిద్ధంగా ఉండాలి… అని అన్నారు. బలమైన ఆహారం తీసుకుంటున్నప్పటికీ శరీరం అదుపులో ఉండేలా ఎన్టీఆర్ చూసుకునేవారు.
పొట్ట రాకుండా జాగ్రత్త పడేవారని ప్రకాష్ చెప్పుకొచ్చారు. తిండి కలిగితే కండ కలదోయ్… కండ కలవాడే మనిషోయ్ అన్న సిద్ధాంతం ఆయన గట్టిగా నమ్మేవారని తెలుస్తుంది. ఇక సినిమా సెట్స్ లో ఎన్టీఆర్ బిహేవియర్ గురించి కూడా ప్రకాష్ చెప్పారు. ఎన్టీఆర్ కి అందరూ భయపడతారని అనుకుంటారు కానీ అది నిజం కాదు. బాలకృష్ణకు భయపడతారు. ఎన్టీఆర్ అంటే అందరికీ గౌరవం ఉంటుంది. తనకంటే తక్కువ స్థాయి వ్యక్తులను కూడా ఎన్టీఆర్ గౌరవంగా పిలుస్తారు. మర్యాదగా మాట్లాడుతారని పచ్చల ప్రకాష్ చెప్పుకొచ్చారు.