చంద్రబాబు అరెస్ట్ అంశం.. కొత్త పొత్తులకు తెర తీసింది. టీడీపీకి జనసేన పార్టీ మద్దతు ప్రకటించింది. 2024లో జరిగే స్వార్వత్రిక ఎన్నికల్లో తాము ఉమ్మడిగా కలిసి పోటీ చేస్తామని ప్రకటించారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. త్వరలోనే ఈ రెండు పార్టీల నేతలతో సమన్వయ కమిటీ ఏర్పాటుపై ప్రస్తుతం కసరత్తు సాగుతోంది. అయితే నారా కుటుంబంలో వచ్చిన ఓ కుదుపు ఆమెను రాజకీయాల్లోకి వచ్చేలా చేస్తోంది. చంద్రబాబు అరెస్ట్ కు నిరసనగా రాష్ట్రవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు కొనసాగుతున్నాయి.
ఇందులో భాగంగా రాజమండ్రిలో చేపట్టిన కాగడాల ప్రదర్శనలో భువనేశ్వరి, బ్రాహ్మణి పాల్గొన్నారు. ఇందులో బ్రాహ్మణి మాట్లాడిన మాటలు పార్టీ నేతల మనసులని కదలింపజేశాయి. దేశం గర్వించదగిన నాయకుడు చంద్రబాబు, ఏ తప్పు చేశారని జైల్లో పెడతారు అంటూ ఆక్రోషించారు. సంక్షేమం చేయడమే ఆయన చేసిన నేరమా? అని నిలదీశారు. తాను ఒకచోట, లోకేశ్-దేవాన్ష్ మరోచోట ఉండాల్సిన పరిస్థితి వచ్చిందని, తన భర్త లోకేశ్ ను అరెస్ట్ చేస్తారేమో అని చెప్పినప్పుడు కార్యకర్తల కళ్లల్లో నీళ్లు తిరిగాయి. తాము ఎప్పుడూ ఒంటరి కాదని, తమ వెంట లక్షలాది మంది ప్రజలు ఉన్నారంటూ ఆమె ఇచ్చిన స్పీచ్ కు కార్యకర్తలు హ్యాట్సాఫ్ చెబుతున్నారు.
ఒకవేళ లోకేశ్ అరెస్ట్ అయితే నారా బ్రాహ్మణి ప్రజల్లోకి వచ్చేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారని పార్టీ నేతల్లో చర్చ జరుగుతోంది. ఎప్పుడూ రాజకీయ విమర్శలు చేయని బ్రాహ్మణి రాజమండ్రిలో చేసిన వ్యాఖ్యలతో కార్యకర్తల్లో కసి పెరిగింది. టీడీపీని బతికించుకోవడానికి ఏం చేయడానికైనా సిద్ధం అంటూ 2 రోజుల క్రితం ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే బ్రాహ్మణి ప్రజల్లోకి వచ్చేందుకు ప్రణాళిక సిద్ధం చేసుకుంటున్నారు. పార్టీ కష్ట సమయలో చంద్రబాబు, లోకేశ్ ప్రశాంతంగా బయటకు వచ్చే వరకు నారా బ్రాహ్మణి రాజకీయంగా కీలక పాత్ర పోషించేందుకు రెడీ అవుతున్నారు.