బీఆర్‌ఎస్ అభ్యర్థ్ధి రాగిడి లక్ష్మారెడ్డిని గెలిపించాలని ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి శ్రేణులకు పిలుపునిచ్చారు. శుక్రవారం బోడుప్పల్ బీఆర్‌ఎస్ పార్టీ కార్యాలయంలో పార్టీ అధ్యక్షుడు మంద సంజీవరెడ్డి అధ్యక్షతన జరిగిన పార్లమెంట్ ఎన్నికల సమావేశానికి ముఖ్య అతిథిగా రాగిడి లక్ష్మారెడ్డి, మేయర్ బుచ్చిరెడ్డితో కలిసి పాల్గొన్నారు. రాగిడి లక్ష్మారెడ్డి మాట్లాడుతూ…
ఆరు గ్యారంటీలు, 420 హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ గడిచిన 3 నెలల కాలంలో తెలంగాణను అన్ని రకాలుగా భ్రష్టుపట్టించిందని ఆరోపించారు. ప్రజలు ఇప్పటికే కాంగ్రెస్ పాలనపై విసుగుచెందారని, కేసీఆర్ నాయకత్వం కోసం ఆశగా ఎదురుచూస్తున్నారని చెప్పారు. కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ కొత్త లక్ష్మీరవిగౌడ్, స్థానిక కార్పొరేటర్లు, పార్టీ ప్రధాన కార్యదర్శి మీసాలకృష్ణ పాల్గొన్నారు.
అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీకి రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో భంగపాటు తప్పదని ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి అన్నారు. శుక్రవారం పీర్జాదిగూడ పరిధిలో మేయర్ జక్క వెంకట్‌రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మల్కాజిగిరి బీఆర్‌ఎస్ ఎంపీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి పరిచయ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు.