తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా అసెంబ్లీ లాబీలో మల్లారెడ్డి మాట్లాడారు. గతంలో ఆయన నివాసంలో ఐటీ అధికారులు దాడులు నిర్వహించిన విషయం తెలిసిందే. ఆ సందర్భాన్ని గుర్తుచేస్తూ మల్లారెడ్డి పలు వ్యాఖ్యలు చేశారు. ఐటీ అధికారులు నా ఇంట్లో డబ్బులున్న గదినే చూడలేదు. ఆ డబ్బులే ఇప్పుడు ఎన్నికల్లో ఖర్చు చేస్తున్నా అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
అయితే ఎమ్మెల్యేల ప్రమాణస్వీకారం సందర్భంగా అసెంబ్లీలో ఆసక్తికర పరిణామం చోటుచేసుకున్నది. మాస్ మలన్నగా పేరుగాంచిన మాజీ మంత్రి చామకూర మల్లారెడ్డి తనవంతు రాగానే ప్రమాణ స్వీకార వేదికకు వస్తూ అందరికి నమస్కరించారు. అధికారపక్షంతోపాటు స్వపక్షంలోని సభ్యులందరికీ నవ్వుతూ చేతులు జోడించి నమస్కరించారు.
దీంతో సీఎం రేవంత్‌రెడ్డి సహా సభలోని మిగతా సభ్యులంతా నవ్వడం కనిపించింది. మల్లారెడ్డి సైతం తనదైన చిరునవ్వుతోనే ప్రమాణ స్వీకారాన్ని ముగించి, ప్రొటెం స్పీకర్‌కు నమస్కరించి తన స్థానంలో కూర్చున్నారు.