దివ్యాంకా త్రిపాఠి దహియా , భారతీయ నటి. ఆమె ఎక్కువగా హిందీ సీరియల్స్ లో నటిస్తుంది. తన నటనతో హిందీ సీరియల్ రంగంలో గొప్ప పేరు సంపాదించుకుంది. జీ టీవిలో ప్రసారమైన బనూ మై తేరీ దుల్హన్ ధారావాహికలో ఆమె చేసిన ద్విపాత్రాభినయంతో గుర్తింపు పొందింది. ఈ సీరియల్ లోని ఆమె నటనకు భారతీయ టెలివిజన్ అకాడమీ ఉత్తమ నటి పురస్కారం అందుకుంది.
ప్రస్తుతం స్టార్ ప్లస్ లో ప్రసారమవుతున్న యే హై మొహొబ్బతే సీరియల్ లో ఆమె నటించిన డాక్టర్. ఇషితా రమన్ భల్లా పాత్రకు ఇండియన్ టెలీ ఉత్తమ కథానాయిక పురస్కారం పొందింది. భోపాల్ లో ఆకాశవాణిలో నటిగా కెరీర్ ను ప్రారంభించింది.
2003లో జరిగిన ప్యాంటీన్ జీ టీన్ క్వీన్ పోటీల్లో మిస్ బ్యూటిఫుల్ స్కిన్ టైటిల్ గెలుచుకుంది. 2004లో ఇండియాస్ బెస్ట్ సినీస్టార్స్ కీ ఖోజ్ పోటీల్లో పాల్గొన్న ఆమె భోపాల్ జోన్ కు విజేతగా నిలిచింది. 2005లో మిస్ భోపాల్ టైటిల్ గెలుచుకుంది.