కండ్ల కలక రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి..? వస్తే ఏం చేయాలి..?

కండ్ల కలక వచ్చిన వారి కండ్లలోకి చూస్తే ఇది వ్యాప్తి చెందదు. పింక్‌-ఐ వచ్చిన వారు ఉపయోగించిన వస్తువులను మనం ఉపయోగించినా, వారు తాకిన వాటిని మనం తాకినా.. వారితో కరచాలనం చేసినా.. చేతులు శుభ్రం చేసుకోవాలి. అలా చేతులు కడుక్కోకుండా అలానే మన కండ్లను తుడుచుకోవడం, తాకడం చేస్తే వస్తుంది. కాంటాక్ట్‌ లెన్స్‌ వాడే అలవాటున్న వారు వాటిని సరిగ్గా శుభ్రం చేసుకోకపోవడం కారణంగా వస్తోంది. స్కూళ్లు, జన సమూహాల్లో ఏ ఒక్కరికి వైరస్‌ వచ్చినా మిగిలిన వారికి వేగంగా వ్యాపిస్తోంది.

ఈ లక్షణాలుంటే కండ్ల కలక వచ్చినట్లే.. ఒక కన్ను లేదా రెండు కండ్లు ఎర్రగా మారడం. కండ్లలో మంట, నొప్పి లేక దురద. కనురెప్పలు వాపురావడం. కంటి రెప్పలు అతుకున్నట్లు అనిపించడం(ఉదయం నిద్రలేచే సరికి ఎక్కువ ఊసులతో కను రెప్పులు అతుక్కొని ఉండడం) వెలుతురును చూడలేక పోవడం. కళ్ల నుంచి నీరు, చిక్కటి ద్రవం కారడం. బ్యాక్టీరియా కారణంగా కండ్ల కలక వస్తే కళ్లలో నుంచి చీము వచ్చే అవకాశం ఉంది. అలా వచ్చినప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే చూపు కోల్పోవచ్చు.

కండ్ల కలకకు కారణమయ్యే వైరస్‌తో సాధారణ జలుబు వస్తుంది. చిన్న పిల్లలకు జ్వరం కూడా రావచ్చు. వచ్చిన వారికి ఈ జాగ్రత్తలు తప్పనిసరి.. కండ్ల కలక వచ్చిన వారు కండ్లు నలవడం, కంట్లో చేతులు పెట్టడం చేయొద్దు. శుభ్రమైన టిష్యూ లేక కర్చీఫ్‌ వాడి కండ్లు తుడుచుకోవాలి. వేడి నీళ్లలో వాటిని శుభ్రం చేసుకోవాలి. నల్లటి అద్దాలు ధరించాలి. తద్వారా వైరస్‌ వేరే వారికి వ్యాపించకుండా ఉంటుంది. ఐసోలేట్‌ అయిపోవాలి. వైరస్‌ వచ్చిన వారు వేరు గదిలో ఉండడం ద్వారా ఇంట్లో మిగిలిన వారికి రాకుండా చూసుకోవచ్చు. కండ్ల కలక వచ్చిన వారు వాడే టవల్స్‌, కర్చీఫ్‌ వేరే వారు వాడకూడదు.

పిల్లల్లో ఈ లక్షణాలు కనిపించినప్పుడు వారిని స్కూల్‌కు పంపకుండా, వ్యాప్తిని అరికట్టడానికి ప్రయత్నించాలి. సొంత ప్రయోగాలు, ఇంటి వైద్యంతో ఆలస్యం చేయకుండా సమస్య చిన్నగా ఉన్నప్పుటే వైద్యుల సలహా మేరకు చికిత్స తీసుకుంటే మంచిది

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *