పాత్ర ఏదైనా.. అందులో ఒదిగి నటించడమే ఆమెకు తెలుసు. తెరపై ఆమె కనబడినపుడు పాత్ర కనబడుతుంది కానీ నటి కనిపించదు. ఆమెను చూడగానే ఒక అంతులేని కథ, సిరిసిరిమువ్వ, సాగర సంగమం లాంటి కుటుంబ కథా చిత్రాలు గుర్తొస్తాయి. అంతే కాకుండా అడవిరాముడు, ఊరికి మొనగాడు లాంటి మాస్ చిత్రాల్లో నటించి మెప్పించింది. సీతా కల్యాణం, శ్రీ తిరుపతి వేంకటేశ్వర కల్యాణం లాంటి పౌరాణిక పాత్రలతో సీత , పద్మావతిగా ప్రేక్షకాభిమానం పొందింది. సింహాసనం, రాజపుత్ర రహస్యం వంటి జానపద చిత్రాల్లో రాజకుమారిగా అభిమానుల మందార మాలలు అందుకుంది. అయితే సినీ నటి, మాజీ ఎంపీ జయప్రదకు కోర్టు బిగ్ షాక్ ఇచ్చింది.
ఆమెకు ఏకంగా ఆరు నెలల జైలు శిక్షను విధిస్తూ తీర్పు వెలువరించింది.జయప్రదతో పాటు నేరానికి పాల్పడిన మరో ముగ్గురు వ్యక్తులకు జైలు శిక్ష ఖరారు చేసింది. తమ వద్ద పని చేసిన కార్మికుల ఈఎస్ఐ మొత్తాన్ని జయప్రద చెల్లించని కారణం చెన్నైలోని ఎగ్మోర్ కోర్టు శిక్ష విధించింది. అలాగే ఒక్కొక్కరికి రూ. 5 వేలు జరిమానా విధించింది. చెన్నైకు చెందిన రామ్ కుమార్, రాజబాబు అనే వ్యక్తులతో కలిసి జయప్రద థియేటర్స్ నడిపారు. ఈ థియేటర్స్ లో పని చేసిన కార్మికుల నుండి వసూలు చేసిన ఈఎస్ఐ మొత్తాన్ని చెల్లించలేదు.
దీంతో సదరు వర్కర్స్ చెన్నై ఎగ్మోర్ కోర్టును ఆశ్రయించారు. కొన్నాళ్లుగా ఈ కేసు నడుస్తుంది. తనపై దాఖలైన పిటిషన్ కొట్టివేయాలంటూ జయప్రద కోర్టును కోరారు. ఆమె అభ్యర్థనను కోర్టు తోసిపుచ్చింది. జయప్రద కార్మికుల ఈఎస్ఐ డబ్బులు చెల్లించలేదని నమ్మిన కోర్ట్ ఆమెకు శిక్ష విధించింది. ఈ తీర్పుపై జయప్రద పై కోర్టుకు వెళ్లనున్నారని సమాచారం. రాజమండ్రిలో పుట్టిన జయప్రద స్టార్ హీరోయిన్ గా ఎదిగారు.
70,80 దశకాలలో ఆమె హవా నడిచింది. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో రాణించారు రాజకీయ ప్రవేశం కూడా చేసిన జయప్రద టీడీపీతో పాటు పలు పార్టీల్లో పని చేశారు. రాజ్య సభకు వెళ్లారు. ప్రస్తుతం ఆమె బీజేపీ పార్టీలో ఉన్నారు. జయప్రద 1986లో బాలీవుడ్ నిర్మాత శ్రీకాంత్ నహతను వివాహం చేసుకున్నారు. అప్పటికే ఆయనకు వివాహమైంది. భార్యకు విడాకులు ఇవ్వడకుండా జయప్రదను పెళ్లాడటం వివాదాస్పదమైంది. జయప్రదకు పిల్లలు లేరు. ఆమె టాక్ షో హోస్ట్ గా కూడా చేశారు.