బస్సు యాత్రకు బ్రేక్ ఇచ్చిన సీఎం జగన్… అనంతపురం జిల్లాలోనే ఈస్టర్‌ను జరుపుకోనున్నారు. ధర్మవరం నియోజకవర్గంలోని సంజీవపురంలో కుటుంబ సభ్యులతో కలిసి ఈస్టర్‌ను సెలబ్రేట్ చేసుకుంటారు జగన్. అలాగే, ఇవాళ ముఖ్య నాయకులు, కార్యకర్తలతో భేటీలు కొనసాగనున్నాయ్. అయితే అనంతపురం జిల్లా గుంతకల్లు నియోజకవర్గంలోని గుత్తిలో సీఎం జగన్ ‘సిద్ధం’ బస్సు వైపు గుర్తు తెలియని వ్యక్తి చెప్పు విసరడం కలకలం రేపింది.
బస్టాండు సమీపంలో బస్సు యాత్రలో భాగంగా సీఎం జగన్ ప్రజలకు అభివాదం చేస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. మరోవైపు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి కర్నూలు జిల్లాలో..నిరసన సెగ తగిలింది. మేమంతా సిద్ధం బస్సు యాత్రలో భాగంగా.. తుగ్గలి నుంచి అనంతపురం జిల్లాకు వెళుతుండగా జొన్నగిరి వద్ద మహిళలు.. సీఎం బస్సును అడ్డుకున్నారు. తమ గ్రామంలో తాగునీటి సమస్య తీవ్రంగా ఉందని..పరిష్కరించాలని డిమాండ్ చేశారు.
జొన్నగిరి చెరువును హంద్రీ జలాలతో నింపుతామని చెప్పి..నింపలేదన్నారు. మహిళలు బిందెలు తీసుకొని రోడ్డు మీదకి వస్తుండగా.. పోలీసులు అడ్డుకున్నారు. పత్తికొండ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి వారిస్తున్నా.. ప్రజలు వినకుండా ముఖ్యమంత్రి కాన్వాయ్‌ని అడ్డుకున్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో ముఖ్యమంత్రి జగన్ బస్సు దిగి వచ్చి… మహిళలతో మాట్లాడి వెళ్లిపోయారు.