కేంద్ర ఆహార శాఖ మంత్రి పీయూష్ గోయల్ ఇవాళ దేశ రాజధాని ఢిల్లీలో భారత్ రైస్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ పధకం కింద నాణ్యమైన సన్న బియ్యాన్ని కిలో 29 రూపాయలకే అందించనున్నారు. దేశీయ మార్కెట్‌లో సన్న బియ్యం సహా నిత్యావసర వస్తు ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. అదే సమయంలో ద్రవ్యోల్బణం పెరిగిపోయింది. ద్రవ్యోల్బణాన్ని నియంత్రించేందుకు భారత్ బ్రాండ్ పేరుతో తక్కువ ధరకు గోధుమ పిండి, పప్పులు, ఉల్లిపాయలు, టొమాటో విక్రయించిన కేంద్ర ప్రభుత్వ భారత్ ఆటాను గత ఏడాది నవంబర్ 6 నుంచి మార్కెట్‌లో ప్రవేశపెట్టింది.
బయటి మార్కెట్‌లో కిలో ఆటా 35 రూపాయలుంటే..కేంద్ర ప్రభుత్వం 27.50 రూపాయలకే ఇస్తోంది. ఇప్పుడు తాజాగా భారత్ రైస్ పేరుతో సన్న బియ్యం విక్రయాలు ప్రారంభించింది. రెండ్రోజుల క్రితం కర్నాటకలోని కోలార్‌లో కేవలం రెండు గంటల్లోనే 10 టన్నుల బియ్యం అమ్ముడుపోవడంతో ఈ బియ్యానికి ఎంత డిమాండ్ ఉందో వెలుగులోకి వచ్చింది. బియ్యాన్ని రూ.29కి విక్రయిస్తున్నారనే వార్త తెలియడంతో ప్రజలు బైక్‌లు, ఆటోలు, కార్లలో వచ్చి 5, 10 కిలోల బస్తాలను కొనుగోలు చేశారు. కొద్దిసేపటికే మొత్తం స్టాక్‌లు అమ్ముడుపోవడంతో చాలా మంది రిక్తహస్తాలతో తిరిగొచ్చినట్లు నివేదికపేర్కొంది. దేశంలోని చాలా ప్రాంతాల నుంచి ఇదే రకమైన కథనాలు వస్తున్నాయి.
ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎఫ్సీఐ) రెండు సహకార సంఘాలకు 5 లక్షల టన్నుల బియ్యాన్ని అందిస్తోంది. నేషనల్ అగ్రికల్చరల్ కోఆపరేటివ్ మార్కెటింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ఎన్ఏఎఫ్ఈడీ), నేషనల్ కోఆపరేటివ్ కన్స్యూమర్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్సీసీఎఫ్) లకు అందిస్తోంది. ఈ ఏజెన్సీలు 5 కిలోలు, 10 కిలోల ప్యాక్‌లలో బియ్యాన్ని ప్యాక్ చేస్తాయి. భారత్’ బ్రాండ్ కింద తమ అవుట్‌లెట్ల ద్వారా రిటైల్ చేస్తాయి. ఈ-కామర్స్ ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా కూడా బియ్యాన్ని విక్రయించనున్నారు.