నటి అపర్ణ నాయర్ తిరువనంతపురంలోని తన ఇంట్లో గురువారం అనుమానాస్పద రీతిలో ఆత్మహత్యకు పాల్పడిన సంగతి తెలిసిందే. అపర్ణ మృతి మలయాళ సినీ ఇండస్ట్రీలో సంచలనంగా మారింది. ఆమె మరణం వెనుక ఎన్నో అనుమానాలు తలెత్తాయి. అయితే మలయాళ నటి అపర్ణా నాయర్ తన ఇంట్లో శవమై కనిపించింది. పలు సినిమాలు, టీవీ సీరియల్స్, షోస్‌లో నటించి పేరుతెచ్చుకున్న అపర్ణ (31) ఆమె నివాసంలోనే అపస్మారక స్ధితిలో కనిపించడంతో కలకలం రేగింది.
ఆమె మరణానికి కొన్ని గంటల ముందు తన ఇన్‌స్టాగ్రామ్‌లో తన చివరి పోస్ట్‌ను పంచుకుంది. కిల్లిపాళంలోని ప్రైవేట్ ఆస్పత్రి నుంచి నటి మరణవార్త సమాచారం తమకు అందిందని పోలీసులు పేర్కొన్నారు. అపర్ణను ఆస్పత్రికి తరలించేలోగానే మరణించిందని వైద్యులు నిర్ధారించారు. గురువారం సాయంత్రం తిరువనంతపురంలోని తన ఇంట్లో అపర్ణ ఉరివేసుకుని కనిపించింది. దీంతో వెంటనే స్థానికులు ఆసుపత్రికి తరలించగా వైద్యులు ఆమె అప్పటికే చనిపోయినట్లు ప్రకటించారు. పోలీసులు అసహజ మరణంగా కేసు నమోదు చేశారు.
ఆమె మరణానికి ముందు అపర్ణ నాయర్ తన చిన్న కుమార్తె ఫోటో, వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్నారు. వీడియోకు బ్యాక్ గ్రౌండ్ గా ఓ లాలిపాటను జోడించారు. అపర్ణ ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ అంతా ఆమె భర్త , ఇద్దరు కుమార్తెల సంతోషంగా ఉన్న ఫోటోలు, వీడియోలే ఉన్నాయి. తాజా ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌లో, అపర్ణ తన భర్త సంజీత్‌ను ‘నా బలం’ అని పేర్కొంది. ప్రస్తుతం అపర్ణ మృతికి గల కారణాలు తెలియరాలేదు. అపర్ణ మృతితో కుటుంబ సభ్యులు, అభిమానులు, సినీ ప్రముఖులు అందరూ షాక్‌కు గురయ్యారు.