గత ప్రభుత్వ హయాంలో మహిళల రక్షణకు పెద్దపీట వేస్తున్నామని చెప్పి, 2019 డిసెంబర్ లో హైదరాబాద్ లో దిశా ఘటన తర్వాత ఏపీ అసెంబ్లీ సమావేశాలలో ప్రభుత్వం చట్ట సవరణ చేసి దిశా చట్టాన్ని తీసుకువచ్చింది. కేంద్రం అనుమతి పొందకుండానే ఆ చట్టాన్ని అమలు చేస్తున్నామని చెప్పిన నాటి జగన్ ప్రభుత్వం దానికోసం దిశ ప్రత్యేక పోలీస్ స్టేషన్లను కూడా ఏర్పాటు చేసింది.
అయితే సచివాలయంలో హోంమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ… ఏపీ ప్రజలు, అధినేత చంద్రబాబు ఆశీస్సులతో బాధ్యతలు చేపట్టినట్లు చెప్పారు. తనను ఆశీర్వదించిన పాయకరావుపేట ప్రజలకు ఆమె ధన్యవాదాలు తెలిపారు. తన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తానని చెప్పారు. దిశ పోలీస్ స్టేషన్ల పేరును మారుస్తామన్నారు.
సోషల్ మీడియాలో మనోభావాలు దెబ్బతీసేలా వ్యవహరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వంద రోజుల్లో గంజాయి, డ్రగ్స్ రవాణా చాలా మేరకు తగ్గిస్తామని ఆమె హామీ ఇచ్చారు. గత ప్రభుత్వ హయాంలో పెట్టిన అక్రమ కేసులపై విచారణ జరిపిస్తామన్నారు. బాధితులు కేసులు రీఓపెన్ చేయాలని కోరితే తప్పకుండా చేస్తామన్నారు.