కన్నడ ఇండస్ట్రీకి చెందిన నటీనటులు టాలీవుడ్ లో కూడా తమ పాపులారిటీ పెంచుకుంటున్నారు. అలాంటి వారిలో రాక్ స్టార్ యష్ ఒకరు. ఒకప్పుడు యష్ అంటే ఎవరికీ పెద్దగా తెలియదు.. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ‘కేజీఎఫ్’ సీరీస్ తో ఏకంగా పాన్ ఇండియా స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు. తాజాగా యష్ కాన్వాయ్ ఢీ కొని ఓ అభిమాని కాలు విరిగింది. ఈ ఘటన బళ్లారి సమీపంలోని తాలూర్ లోని అమృతేశ్వరాలయం వద్ద చోటు చేసుకుంది.
ప్రముఖ నిర్మాత కొర్రపాటి సాయి నిర్మించిన అమృతేశ్వరాలయానికి నేడు శంకుస్థాపన చేశారు. ఈ సందర్బంగా ఆలయ ప్రాణ ప్రతిష్టాపన కార్యక్రమానికి అతిథిగా యష్ తో పాలు ఇతర ప్రముఖులు విచ్చేశారు. ఈ వేడుకకు దర్శకధీరుడు రాజమౌళి, రాష్ట్ర మంత్రి బి నాగేంద్ర విచ్చేశారు. బళ్ళారికి హీరో యష్ వస్తున్నాడన్న వార్త తెలియగానే అభిమానులు అక్కడికి ఎక్కువ సంఖ్యలో వచ్చారు. ఇటీవల యష్ ఎక్కడికి వెళ్లినా అభిమానుల తాకిడి ఎక్కువ అవుతుంది.
ఆయనతో సెల్ఫీకోసం ఎగబడుతున్నారు. ఈ మద్యనే ఆయన పుట్టిన రోజు సందర్బంగా ఆయన బ్యానర్ కడుతున్న సందర్భంగా కరెంట్ షాక్ తగిలి ముగ్గురు అభిమానులు చనిపోయారు. ఈ ఘటనతో యష్ తీవ్ర ఆవేదన చెందారు. స్వయంగా వెళ్లి వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. పరామర్శించి వస్తున్న సమయంలో అనీల్ అనే స్కూటరిస్ట్ యష్ కారుకి వచ్చి ఢీ కొట్టాడు. ఈ ప్రమాదంలో పెద్దగా గాయాలు కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.