దేశ – కాలాదులకు అనుగుణంగా సంతృప్తికరమైన ఆహారమును రోజుకు రెండువేళలందు మాత్రమే భుజించాలి. అవి.. పగలు, రాత్రి. త్రేనుపు సులువుగా కలుగుట, మలమూత్రములు సాఫీగా పోవుట, ఆకలిదప్పులు కలుగుట అనే లక్షణాలు ఆహారం బాగా జీర్ణమైన వానిలో కలుగుతాయి. బంగారు పాత్రలో భోంచేయు వారికి సకల దోషాలు హరించును.
వెండి పాత్రములో భోంచేయు వారికి నేత్ర వ్యాధులు వచ్చే అవకాశాలు లేవు. పిత్త వ్యాధులు దరిజేరవు. భోజనం చేసే ప్రతిసారీ.. కొంచెం అన్నంలో అల్లం, సైంధవ లవణం కలిపి తినుట చాలా ఆరోగ్యకరం.
అన్నం మీద అయిష్టతను, అరుచిని పోగొట్టి.. ఆకలిని వృద్ధిచేస్తుంది. నాలుకను, కంఠమును శుద్దిచేస్తుంది. భోజనం చేయడానికి ముందు.. ఫలంలో దానిమ్మ ఫలం తినవచ్చును. అరటిపండు, దోసపండు తినకూడదు. వీటిని భోజనాంతరం తినవచ్చును.