అవును… ఏపీలో కూటమి ప్రభుత్వం కొలువుదీరింది. ఈ సమయంలో నేడు మంత్రులకు శాఖలు కేటాయించారు. ఇందులో భాగంగా ప్రధానంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, అటవీ, సైన్స్ & టెక్నాలజీ వంటి కీలక శాఖలను కేటాయించారు. ఇదే సమయంలో జనసేన పార్టీ నేతకే సినిమాటోగ్రఫీ శాఖ కేటాయించబడింది.
ఏపీలో కూటమి ప్రభుత్వం కొలువుదీరిన వేళ సినిమాటోగ్రఫీ శాఖ ఎవరికి ఇస్తారనే చర్చ జరిగింది. పైగా పవర్ స్టార్ పవన్ కల్యాణ్ మంత్రిగా ఉన్న ప్రభుత్వం కావడంతో దీనిపై మరింత ఆసక్తి నెలకొంది. అయితే చాలా మంది భావించినట్లుగానే ఆ శాఖ జనసేనకు దక్కింది. ఇందులో భాగంగా నిడదవోలు నుంచి పోటీ చేసి గెలిచిన కందుల దుర్గేష్ కు ఈ శాఖను కేటాయించారు.
ఈ సందర్భంగా కందుల దుర్గేష్ కు సినిమాలకూ ఏమిటి సంబంధం అనే చర్చ తెరపైకి వచ్చింది! అయితే… చాలా మందికి తెలియని విషయం ఏమిటంటే… కందుల దుర్గేష్ 1991లోనే నిర్మాతగా వ్యవహరించారు. ఇందులో భాగంగా భానుచందర్, శోభన హీరో హీరోయిన్లుగా నటించిన “కీచురాళ్లు” సినిమాకు ఆయన నిర్మాతగా ఉన్నారు. ఆ సినిమాకి గీతాకృష్ణ దర్శకులు కాగా… ఇళయరాజా సంగీతాన్ని అందించారు.