ఇజ్రాయెల్‌కు చెందిన 12 ఏండ్ల బాలుడు సులేమాన్ హసన్ సైకిల్‌పై వెళ్తుండగా కారు బలంగా ఢీకొంది. ఈ ప్రమాదంలో హసన్ తీవ్రంగా గాయపడ్డాడు. అతడి తల భాగం మెడ నుంచి దాదాపు వేరయింది. వెంటనే అతడిని విమానంలో హదస్సా మెడికల్ సెంటర్‌కు తరలించారు. వైద్యులు కొన్ని గంటలపాటు శ్రమించి, తెగిపోయిన అతడి తలను తిరిగి అతికించారు. అయితే తల, శరీరం దాదాపు ఒకదాన్నుంచి మరోటి వేరైన స్థితిలో హసన్‌ను తీసుకొచ్చినట్లు ఆస్పత్రి ఆర్థోపెడిక్ సర్జన్ డా.ఓహాద్ ఈనావ్ తెలిపారు. శిరస్సుతో వెన్నెముక చివరి అంచును కలిపి ఉంచే భాగం దాదాపు విడిపోయింది.
”మేమంతా హసన్ పరిస్థితి చూసి నివ్వెరపోయాం. తల, మెడ కలిసే చోటులోని లిగ్మెంట్లు పూర్తిగా దెబ్బతిన్నాయి. వెంటనే సమీక్ష నిర్వహించి ఆపరేషన్ చేయాలని నిర్ణయించాం. శస్త్రచికిత్స ద్వారా హసన్ తల, వెన్నెముకను తిరిగి కలిపాం. ఇది ఎంతో క్లిష్టమైన ప్రక్రియ. ఆస్పత్రిలోని అన్ని విభాగాల స్పెషలిస్ట్ వైద్యులు కొన్ని గంటలపాటు శ్రమించారు. ఆపరేషన్ సమయంలో వైద్యుల సాంకేతిక అనుభవం ఎంతగానో ఉపయోగపడింది.
ప్రమాదం జరిగిన వెంటనే ట్రామా సిబ్బంది సత్వరం స్పందించి ప్రాథమిక చికిత్స అందించడం నుంచి.. ఆపరేషన్ చేయడం వరకూ ప్రతి నిర్ణయం హసన్ ప్రాణాల్ని నిలబెట్టేందుకు తోడ్పడింది. మా ప్రయత్నం వృథా కాలేదు. ఆపరేషన్ విజయవంతమైంది” అని డా.ఓహాద్ ఈనావ్ తెలిపారు. హసన్‌కు గత నెలలో శస్త్రచికిత్స చేయగా.. ప్రస్తుతం పరిస్థితి మెరుగవడంతో ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేశారు. ఆపరేషన్ తర్వాత నెలరోజుల పాటు హసన్‌ను ఆస్పత్రిలో వైద్యులు, నర్సులు అనుక్షణం గమనిస్తూ కంటికి రెప్పలా కాపాడారు.
బతకడనుకున్న తమ కుమారుడికి పునర్జన్మనిచ్చిన వైద్యులకు చెమ్మ గిల్లిన కళ్లతో హసన్ తండ్రి ధన్యవాదాలు చెప్పారు. ”మా ఒక్కగానొక్క బిడ్డను తిరిగి ప్రాణాలతో తమకు అప్పగించిన వైద్యులకు నేను జీవితాంతం రుణపడి ఉంటా…. ప్రమాదం జరిగిన తర్వాత బతికే అవకాశాలు తక్కువగా ఉన్నప్పటికీ.. అపార అనుభవం కలిగిన వైద్య సిబ్బంది, సాంకేతికత, సత్వర నిర్ణయం, ట్రామా, ఆర్థోపెడిక్ బృందాలే మా అబ్బాయిని కాపాడాయని.. అందదుకు తాను వారికి పెద్ద థ్యాంక్స్ చెప్పడం మినహా ఏమీ చేయలేనని హసన్ తండ్రి చెమ్మగిల్లిన కళ్లతో చెప్పారు.