లాక్ డౌన్ కారణంగానే వర్క్ ఫ్రం హోం అనే విధానం చాలా కంపెనీలు అనుసరించాయి. ప్రస్తుతం కూడా కొనసాగుతున్నాయి. ఒక నివేదిక ప్రకారం.. ఆ సమయంలో ప్రజలు డేటింగ్ యాప్‌ను విపరీతంగా ఉపయోగించారట. అయితే బబుల్ అనే డేటింగ్ యాప్.. లవ్వర్, గార్ల్ ఫ్రెండ్ లేని వాళ్లు ఈ డేటింగ్ యాప్ ద్వారా మూడు నాలుగు గంటల పాటు సరదాగా బయట చిట్ చాట్ చేసుకోవచ్చు. ఈ యాప్ ద్వారానే సరదాగా ఓ అమ్మాయితో పరిచయం పెంచుకున్నాడు మహారాష్ట్రలోని పూణెకు చెందిన ఓ యువకుడు.
ఇంకేముంది ఫటాఫట్.. ధనా ధన్.. ఫోటో పంపింది. అతడికి నచ్చింది. ఇంకేముంది రెండు రోజుల్లోనే గిప్సీ రెస్టో అండ్ బార్ కమ్ పబ్‌లో కలుద్దాం అని చెప్పింది. అదీ కూడా కొంత సమయమే అని కండిషన్ పెట్టింది. అమ్మాయి ఆఫర్ ఇస్తే.. కాదనేదేముంది. ఇద్దరూ బుక్ చేసుకున్న టేబుల్ వద్దకు వచ్చారు. రాగానే హుక్కా, వైన్ ఆర్డర్ ఇచ్చేసింది. అతడు రేటు కూడా కనుక్కునేలోపు.. ఆ రెస్టారెంట్ కం బార్ స్టాఫ్ ఆమె ఆర్డర్ చేసినవీ నిమిషాల్లో తీసుకొచ్చి ఇచ్చారు. ఇక స్పెషల్ వైన్ గ్లాస్, చిల్లీ పొటాటో, క్రిస్పీ కార్ష్, వాటర్ బాటిల్ అంతా కలిసి బిల్లు 23 వేల రూపాయలు వచ్చింది.

ఏంటీ ఇంత బిల్లా అని ఆశ్చర్యపోయే సరికి.. ‘కట్టు లేకుంటే.. పార్కింగ్‌లో ఉన్న నీ కారు డ్యామేజ్ చేస్తారు ఈ రెస్టారెంట్ సిబ్బంది. బిల్లు కట్టకుండా పారిపోవాలనుకుంటే.. నీ కారు నెంబరు తెలుసు కాబట్టి.. ఆర్టీఓ ఆఫీసులో అడ్రస్ తీసుకుని.. నీ ఇంటికి వచ్చి డబుల్ వసూలు చేస్తాం. అలాగే నాతో డేటింగ్ కు వచ్చావని మీ ఇంట్లో చెబుతాం’అని బెదిరించే సరికి కట్టి.. ప్రాణాలతో బయటపడ్డానని ఆవేదన వెళ్లగక్కాడు. ఇదంతా అమ్మాయి.. ఆ పబ్ అంతా కలిసి ఆడిన నాటకమని, అదొక దందా అని గ్రహించినట్లు బాధితుడు పేర్కొన్నాడు. తనలా మోసపోకూడదని ఈ విషయాన్ని పంచుకున్నట్లు తెలిపాడు. ఇక నెటిజన్లు.. కామెంట్లతో దూసుకుపోతున్నారు.