కోవిడ్ మహమ్మారి మళ్లీ జడలు విప్పుతోంది. రూపం మార్చుకొని కొత్త వేరియంట్ రూపంలో దండయాత్ర చేస్తోంది. ఇప్పుడు కొత్త వేషంలో వచ్చిన BA.2.86 మ్యూటాంట్ స్ట్రెయిన్ చాలా దేశాల్లో ప్రకంపనలు సృష్టించింది. అతి తక్కువ సమయంలో ఈ వేరియెంట్ కేసులు చాలా దేశాల్లో నమోదు అయ్యాయని.. పైగా ఇది గత వేరియెంట్ల కంటే చాలా డేంజరస్ అని పేర్కొంటున్నారు. పిరోలా వేరియంట్‌లో ఉత్పరివర్తనాలు చాలా భిన్నంగా ఉన్నాయని, 36 మ్యుటేషన్లు ఉన్నాయని నిపుణులు చెప్తున్నారు.
ఇవి రోగ నిరోధక వ్యవస్థ నుంచి సులభంగా తప్పించుకోగలవని, తక్కువ సమయంలో ఎక్కువ మందికి సోకే అవకాశం ఉంటుందని పేర్కొంటున్నారు. అయితే.. ఇది ఎంత తీవ్రమైన సమస్యలను కలిగిస్తుందో ఇంకా తెలుసుకోవాల్సి ఉందన్నారు. ఈ కొత్త వేరియెంట్ గురించి అమెరికాకు చెందిన కార్డియాలజీ నిపుణుడు, స్క్రిప్స్ రీసెర్చ్ ట్రాన్స్‌స్లేషనల్ ఇన్‌స్టిట్యూట్ డైరెక్టర్ ఎరిక్ టోపోల్ మాట్లాడుతూ.. దీని స్పైక్ ప్రోటీన్‌లో 35 కంటే ఎక్కువగా ఉత్పరివర్తనాలు ఉన్నాయన్నారు.
ఇవి.. మానవకణాల్లోకి సులువుగా ప్రవేశించడానికి వీలు కల్పిస్తాయని పేర్కొన్నారు. గతంలో వచ్చిన వేరియెంట్లతో పోలిస్తే.. ఈ పిరోలా మ్యుటేషన్లు భిన్నంగా ఉన్నాయన్నారు. మరోవైపు.. ఈ పిరోలా వేరియంట్‌ను ‘వేరియంట్ అండర్ మానిటరింగ్’గా ప్రపంచ ఆరోగ్య సంస్థ వర్గీకరించింది. తాజా కేసులతో దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 3,420కి పెరిగింది. గత ఏడు నెలల్లో కేసుల సంఖ్య ఇంత చేరడం ఇదే తొలిసారి. ప్రస్తుతం దేశంలో కరోనా కేసులు మళ్లీ పెరగడానికి కొత్త వేరియంట్ జేఎన్.1కారణమని తెలుస్తోంది.
ఇక గత 24 గంటల వ్యవధిలో మహమ్మారి కారణంగా నలుగురు ప్రాణాలు కోల్పోయారు. కేరళలో ఇద్దరు కాగా, రాజస్థాన్, కర్ణాటకలో ఒక్కొక్కరు చొప్పున మృతి చెందారు. దీంతో వైరస్ కారణంగా మరణించిన వారి సంఖ్య 5,33,332కి ఎగబాకింది. ఇప్పటి వరకూ దేశంలో కరోనా వైరస్ బారిన పడిన వారి సంఖ్య 4.50 కోట్లకు (4,50,07,964) చేరింది. మహమ్మారి నుంచి 4,44,71,212 మంది కోలుకున్నారు.