కరోనా మహమ్మారి ఇంకా పూర్తిగా తొలగిపోలేదు. కొత్త కొత్త వేరియంట్లు పుట్టుకొస్తూ ప్రశాంతత లేకుండా చేస్తున్నాయి. ఇప్పుడు ఒమిక్రాన్‌కు మరో కొత్త వేరియంట్ ఎరిస్ పుట్టుకొచ్చింది. ఇంగ్లండ్ నుంచి వ్యాప్తి చెందుతున్న ఈ వేరియంట్ పట్ల అప్రమత్తంగా ఉండాలని ఇంగ్లండ్ వైద్య ఆరోగ్య శాఖ ఇప్పటికే హెచ్చరించింది. అయితే నిజానికి ఇది ఒమైక్రాన్ నుంచి రూపాంతరం చెందిన మరింత శక్తిమంతమైన వేరియంట్. దీన్ని మొదట మేలోనే కనిపెట్టారు. ఇది మే, జూన్, జులైలో పెద్దగా ప్రభావం చూపలేదు.
జులై చివరి నాటికి కరోనా కేసులు 70 ఉండగా.. ఆగస్టు ఆరు నాటికి అవి 116కి పెరిగాయి. కారణం కొత్త వేరియంటే అంటున్నారు. ఎరిస్ వల్ల బ్రిటన్‌లో ముసలివారు ఎక్కువగా ఆస్పత్రిపాలవుతున్నారు. ఐతే.. ICU కేసులు పెద్దగా లేవు. మరణాల సంఖ్య కూడా ఎక్కువ లేదు. తద్వారా ఇది మరీ ప్రాణాంతకమైనది కాకపోవచ్చు అంటున్నారు. అలాగని తేలిగ్గా తీసుకోవద్దని సూచిస్తున్నారు. ఇండియాలో కోట్ల మంది డబుల్ డోస్ వేసుకున్నారు కాబట్టి.. ఎరిస్ ప్రభావం అంతగా ఉండకపోవచ్చు అంటున్నారు.
ఎరిస్ నుంచి మరో కొత్త వేరియంట్ గనుక ఇండియాలో పుడితే.. అది ప్రమాదకరం అయ్యే ఛాన్స్ ఉంటుంది అంటున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) కూడా ఈ కొత్త వేరియంట్‌ని గమనిస్తోంది. ఎందుకంటే ఇండియాలో ఇప్పుడు వ్యాక్సిన్లు ఎవరూ వేయించుకోవట్లేదు. మూడోదైన బూస్టర్ డోస్ చాలా తక్కువ మందే తీసుకున్నారు. ఆల్రెడీ వేయించుకున్న రెండు డోసుల వల్ల వచ్చే యాంటీబాడీలు ఇప్పుడు దాదాపు లేనట్లే. అందువల్ల ఎరిస్ విజృంభిస్తే.. ఇండియాలో కరోనా కేసులు పెరిగే ప్రమాదం ఉంటుంది.