భారీ అంచనాల నడుమ రిలీజ్ కాబోతున్న ఈ హనుమాన్ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి ప్రత్యేక పాత్రలో నటించారు. ఈసినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి చిరంజీవి చీఫ్ గెస్ట్ గా అటెండ్ అయ్యారు. జాంబిరెడ్డి ఫేం ప్రశాంత్ వర్మ డైరెక్ట్ చేస్తున్న ఈసినిమా సంక్రాంతి కానుకగా వస్తోంది. హను-మాన్ సినిమా విడుదల విషయంలో అనేక అవాంతరాలు ఎదుర్కొంటుంది. ఈ సినిమా విడుదలను ఆపేయాలనే ప్రయత్నలు జరిగాయని.. చిన్న ప్రాజెక్ట్ కదా మరో తేదీలో విడుదల చేసుకోవచ్చు కదా అంటూ చిత్ర పరిశ్రమ నుంచి కొందరు ఒత్తిడి తీసుకొస్తున్నారని గతంలో నిర్మాత నిరంజన్ రెడ్డి తెలిపిన విషయం తెలిసిందే.
ప్రస్తుతం ఇండస్ట్రీలో గుంటూరు కారం వర్సెస్ హనుమాన్ వార్ సాగుతోంది. కారణం ఈ రెండు సినిమాలు ఒకే రోజున అనగా డిసెంబర్ 12న విడుదల అవుతున్నాయి. దాంతో ఈ రెండు సినిమాల ఫలితాలు ఎలా ఉంటాయో అన్న దానిపై పెద్ద ఎత్తున ఆసక్తికర ఏర్పడింది. ఈ క్రమంలో హనుమాన్ ప్రీరిలీజ్ ఈవెంట్ కు ముఖ్య అతిథిగా వచ్చిన మెగాస్టార్ చిరంజీవి.. ఈ వివాదంపై పరోక్షంగా స్పందించారు. ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. చిరంజీవి మాట్లాడుతూ.. “ఈ సంక్రాంతి సీజన్‌కు ఎన్ని సినిమాలు వచ్చినా సరే.. కంటెంట్‌లో సత్తా ఉంటే.. దేవుడి ఆశీస్సులు ఉన్నాయంటే ప్రేక్షకులు కచ్చితంగా ఆదరించి, విజయం అందిస్తారు.
ఇందులో ఎలాంటి సందేహం అక్కరలేదు. ఇప్పుడు ఇదీ కాస్త పరీక్షా కాలం అనుకోవచ్చు.. అందరూ అనుకున్నట్లుగా హనుమాన్ సినిమాకు సరిపడా థియేటర్లు దొరకకపోవచ్చు. కానీ సినిమాలో కంటెంట్ ఉంటే సెకండ్ షో చూస్తారు. అదీ లేకపోతే మరో వారం తర్వాత అయినా చూస్తారు. ఈ సంక్రాంతికి వస్తున్న గుంటూరు కారం, సైంధవ్, నా సామిరంగ సినిమాలతో పాటు హను–మాన్ కూడా బాగా ఆడాలి.. ఆడుతాయని ఆశిస్తున్నాను. చిత్ర పరిశ్రమ ఎప్పుడూ పచ్చగా ఉండాలని కోరుకుంటున్నాను” అని చెప్పుకొచ్చారు.