చేతులు, కాళ్ళల్లో తిమ్మిర్లు వస్తున్నాయా..? అయితే, జాగ్రత్త పడాల్సిందే.

ఎక్కువసేపు కదలకుండా కూర్చుంటే కాళ్లు తిమ్మిరెక్కుతాయి. అలాగే అరికాలు, అరచేతిలో కూడా తిమ్మిర్లు వస్తుంటాయి. ఇది అందరినీ ఏదో ఓ సందర్భంలో ఇబ్బంది పెడుతూనే ఉంటాయి. అయితే, ఇలాంటి ఇబ్బంది అప్పుడప్పుడు జరిగితే పెద్ద నష్టం లేదు. కానీ, తరచుగా జరుగుతుంటే మాత్రం అలర్ట్ అవ్వాల్సిందే అంటున్నారు వైద్యులు. ఈ స‌మ‌స్య లక్షణం మూలాల్లోకి వెళ్లకుండా తిమ్మిర్లే కదా అని నిర్లక్ష్యం చేస్తే తిరిగి కోలుకోలేనంతగా నరాలు దెబ్బతిని వివిధ ఆరోగ్య స‌మ‌స్యల‌ను ఎదుర్కోవాల్సి వ‌స్తుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

తిమ్మిర్లు వారాల తరబడి వేధిస్తూ క్రమంగా తీవ్రమవుతూ ఉంటే మాత్రం ఇలాంటి వాటిని శరీరంలోని తీవ్రమైన వ్యాధులకు సంకేతాలుగా భావించాలి. రక్తంలో అధిక చక్కెర కారణంగా నరాలు దెబ్బతినడం వ‌ల్ల చేతులు, కాళ్ళు తిమ్మిరికి గుర‌వుతాయి. క‌డుపులో బిడ్డ పెరుగుతున్నప్పుడు వ‌చ్చే అద‌న‌పు ద్రవాలు శ‌రీరంలోని న‌రాల‌పై నొక్కడం వ‌ల‌న కూడా తిమ్మిర్లు వ‌స్తాయి. చ‌ర్మం వ‌దులుగా మారి బొడ్డు ప్రాంతంలో కూడాతిమ్మిరి వ‌స్తుంది. ప్రస‌వించిన త‌ర్వాత కూడా తిమ్మిర్లు అలాగే ఉంటే చికిత్స పొందాలి.

వెన్నెముక‌లో జారిన డిస్క్ కాళ్ల కింద‌కు వెళ్లే న‌రాల‌పై ఒత్తిడిని క‌లిగించి తిమ్మిర్లకు కార‌ణ‌మ‌వుతుంది. ల్యూప‌స్‌, రుమ‌టాయిడ్ ఆర్థరైటీస్ వంటి ఆటోఇమ్యూన్ వ్యాధుల వ‌ల్ల కూడా తిమ్మిర్లు వస్తాయి. మ‌నం తీసుకునే ఆహారంలో విట‌మిన్ బీ లేదా ఈ విటమిన్‌ లోపించిన‌ప్పుడు అది న‌రాల‌పై ప్రభావం చూపి తిమ్మిర్లు వ‌చ్చేలా చేస్తాయి. క్యాన్సర్ , హెచ్ఐవీ, అధిక‌ర‌క్తపోటు, టీబీ వంటి వ్యాధులను త‌గ్గించుకునేందుకు వాడే మందులు కూడా తిమ్మిర్లు వ‌చ్చేలా చేస్తాయి.

అదేవిధంగా హెప‌టైటీస్ బీ, సీ, లైమ్ డిసీజ్ వంటి కొన్నిర‌కాల వైర‌ల్‌, బ్యాక్టీరియ‌ల్ ఇన్‌ఫెక్షన్లు న‌రాల‌ను దెబ్బతీయడం వల్ల కాళ్లు, చేతుల్లో తిమ్మిర్లు ప్రారంభ‌మ‌వుతాయి. మూత్రపిండాలు స‌క్రమంగా ప‌నిచేయ‌క‌పోయిన‌ట్లయితే కూడా తిమ్మిర్లు క‌నిపిస్తాయి. జ‌న్యుప‌ర‌మైన రుగ్మత వ‌ల్ల కూడా కాళ్లు, చేతుల్లో తిమ్మిర్లు వ‌స్తాయి. న‌రాల‌పై ట్యూమ‌ర్లు పెరుగుతున్న సంద‌ర్భాల్లో, థైరాయిడ్ స‌మ‌స్యతో ఉన్నవారిలో, అలాగే ఎక్కువగా మ‌ద్యం తీసుకునే వారిలో కూడా తిమ్మిర్లు క‌నిపిస్తాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *