హీరోగానే కాదు.. సహ నటుడిగా, హాస్యనటుడిగా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా ఇలా ఎన్నో వైవిద్యమైన పాత్రలు పోషించారు. చనిపోయే ముందు వరకూ వయసుకు తగ్గ పాత్రలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తూ వచ్చారు. నటనలో అద్భుతమైన ఈజ్ ఉన్న నటుడు దొరికాడని ఇండస్ట్రీ మురిసిపోయింది. ఏ పాత్రనైనా అవలీలగా పోషించగల నటులలో చంద్రమోహన్ ముందు వరుసలో ఉంటారని చెప్పుకోవచ్చు.
‘రంగుల రాట్నం’లో చూసిన మహానటులు ఎన్టీఆర్, ఎస్వీ రంగారావు.. ఒక్క అడుగు ఎత్తుంటే ఇండస్ట్రీని ఏలేసేవాడు అని మహానటుడు ఎన్టీఆర్ ప్రశంసించిన సందర్భాలున్నాయి. అంతేకాదు తన ‘బాంధవ్యాలు’ సినిమాలో దాదాపు హీరో పాత్ర ఇచ్చి ప్రోత్సహించారు. దర్శకుడి ఊహలో రూపుదిద్దుకున్న పాత్రకు తెర మీద ప్రాణ ప్రతిష్ట చేయడంలో చంద్రమోహన్‌కు తిరుగులేదని అలనాటి నటీనటులు చెబుతుంటారు. ఎందుకంటే.. తెర మీద ఆయన కనిపించరు కానీ పాత్ర మాత్రమే కనబడేలా చేయగలగడం ఆయన గొప్పతనం. టాలీవుడ్ సీనియర్ నటుడు చంద్ర మోహన్ శనివారం కన్నుమూసిన విషయం తెలిసిందే.
ఈ క్రమంలో చంద్రమోహన్ అంత్యక్రియలను సోమవారం ఉదయం 11 గంటలకు హైదరాబాద్‌లోని పంజాగుట్ట శ్మశాన వాటికలో నిర్వహించనున్నారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లను ఇప్పటికే పూర్తి చేశారు. చంద్రమోహన్ లింగధారులు కావడం వల్ల ఆయన పార్థీవ దేహాన్ని ఖననం చేయనున్నారు. చంద్రమోహన్‌కు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఈ ఇద్దరిలో అంత్యక్రియలు ఎవరు నిర్వహిస్తారనే దానిపై కుటుంబంలో చర్చ జరగినట్లు సమాచారం. అయితే చివరగా చంద్రమోహన్ తమ్ముడు మల్లంపల్లి దుర్గాప్రసాద్ అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు తెలిసింది.