తీన్మార్ మల్లన్న ఫోన్ ట్యాపింగ్ అంశంపై తన యూట్యూబ్ చానెల్‌లో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. టాలీవుడ్ సెలబ్రిటీ కపుల్ నాగచైతన్య, సమంతలు విడిపోవడానికి కారణం ఫోన్ ట్యాపింగ్ వ్యవహారమే అన్నారు. అంతేకాక బీఆర్‌ఎస్ పార్టీకి చెందిన ఓ నేత సమంత ఫోన్ ట్యాప్ చేశారని తెలుస్తోంది. పైగా సదరు నేత కేవలం రాజకీయాలు మాత్రమే కాక.. మందుల వ్యాపారం కూడా నిర్వహిస్తున్నారని చెప్పుకొచ్చారు.
దీనిపై త్వరలోనే పూర్తి వాస్తవాలు వెలుగులోకి వస్తాయి అన్నారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది. కొందరు నేతలు మా ఫోన్లు ట్యాప్ చేశారంటూ డీజీపీకి ఫిర్యాదులు అందించారు. ముఖ్యంగా ఈ వ్యవహారంపై బీజేపీ నేత రఘునందన్‌రావు ఫోన్ ట్యాపింగ్ అంశంపై రాష్ట్ర డీజీపీకి కంప్లైంట్ చేశారు. అప్పటి సీఎం కేసీఆర్ ప్రమేయం లేకుండా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం సాధ్యం కాదన్నారాయన. దీనిపై నిష్పక్షపాతంగా విచారణ జరిపించాలని రఘునందన్‌రావు డిమాండ్ చేశారు.
ఇక బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఆరు గ్యారెంటీల అమలుపై చేతులెత్తేసిన కాంగ్రెస్.. దాన్నుంచి ప్రజల దృష్టి మల్లించడానికే ఈ ఫోన్ ట్యాపింగ్ అంశాన్ని తెర మీదకు తెచ్చారని ఆరోపించారు. 10 లక్షల ఫోన్లను కేసీఆర్ ట్యాప్ చేశారని కాంగ్రెస్ ఆరోపణలు చేస్తుందని..చేస్తే గిస్తే ఒక్కరో ఇద్దరివో ఫోన్లు ట్యాపింగ్ చేసుండొచ్చన్నారు. దొంగల ఫోన్లు ట్యాపింగ్ చేయడమే పోలీసుల పని అన్నారు కేటీఆర్.