మీడియా నివేదికల ప్రకారం, ఆమెను నవంబర్ 2న ఉత్తర ఆధునిక్ మెడికల్ కాలేజీ ఆసుపత్రికి తీసుకెళ్లారు, అక్కడ వైద్యులు ఆమె చనిపోయినట్లు ప్రకటించారు. నటీనటుల ఈక్విటీ అసోసియేషన్ ప్రెసిడెంట్ అహ్సాన్ హబీబ్ నాసిమ్ మీడియాతో మాట్లాడుతూ, ఆమె మెడపై మందమైన లిగేచర్ గుర్తును గమనించిన వైద్యులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. అయితే హుమైరాను ఆసుపత్రిలో చేర్పించి, అక్కడ కాసేపటి వరకు ఉన్న ఆమె స్నేహితుడు ఒకడు.. పోలీసులు వచ్చే సమయంలోనే అక్కడి నుంచి పరారయ్యాడు.
వైద్యులతో మాటలు కలిపి.. వాళ్ల కళ్లు గప్పి ఆ ప్రాంతం నుంచి ఒక్కసారిగా మాయమవ్వడం అనుమానాలకు తావిస్తోంది. ఈ నేపథ్యంలోనే పోలీసులు అనుమానాస్పద మృతి కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. ప్రాథమిక విచారణలో భాగంగా.. ఆసుపత్రి నుంచి వెళ్లిపోయిన ఆ వ్యక్తి హుమైరా ప్రియుడని తెలుస్తోంది. వీరి మధ్య కొంతకాలం నుంచి గొడవలు జరుగుతున్నాయని కూడా వెలుగులోకి వచ్చింది. బహుశా హుమైరా మృతికి ముందు ఇద్దరి మధ్య గొడవ జరిగి ఉండొచ్చని, దాంతో ఆమె ఆత్మహత్యకు పాల్పడి ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు.
అయితే.. పోస్టుమార్టం రిపోర్ట్ వచ్చేదాకా హుమైరా మృతికి గల కారణాలేంటో తెలుస్తాయని, ప్రస్తుతం ఈ విషయంపై దర్యాప్తు చేస్తున్నామని అధికారులు తెలిపారు. కాగా.. 2006 నుంచి హుమైరా తన కెరీర్‌ను సీరియల్ నటిగా ప్రారంభించింది. అనేక బంగ్లాదేశ్ సీరియల్స్‌లో నటించిన ఆమె.. ‘ఛాయాబితి’ అనే టీవీ సిరీయల్ ద్వారా పాపులారిటీ గడించింది. ఆ పాపులారిటీనే ఆమెకు ‘అమర్ బంధు రషీద్’ అనే సినిమాలో నటించే అవకాశం కల్పించింది. అందులో ఆమె నటనకు గాను తారాస్థాయిలో ప్రశంసలు వచ్చిపడ్డాయి. ఇంతలోనే హుమైరా ఆకస్మికంగా మృతి చెందడంతో.. బంగ్లా సినీ ఇండస్ట్రీతో పాటు కుటుంబ సభ్యులు, ఆమె అభిమానులు షాక్‌కు గురయ్యారు.