ప్రజలు చంద్రబాబును తరిమికొట్టాలి.. ప్రజల డబ్బు దోచుకుని దీక్ష పేరుతో అమరవీరులను అవమానపరుస్తున్నారు.. నేను పుట్టి పెరిగినా తిరుపతిలో స్వాతంత్ర్య పోరాటంలో అమరవీరుల ట్రిబ్యూట్ వాల్ కు శంకుస్థాపన చేయడం సంతోషంగా ఉంది అని మంత్రి రోజా పేర్కొన్నారు. అయితే విశాఖపట్నంలో మాజీ మంత్రి బండారు సత్యనారాయణ మూర్తి ఇంటి వద్ద ఉద్రిక్తత నెలకొని ఉంది. పోలీసులు – టీడీపీ నేతల మధ్య బాగా తోపులాట జరిగింది.
బండారు ఇంటిని పోలీసులు చుట్టుముట్టడంతో ఆ ప్రదేశానికి టీడీపీ కార్యకర్తలు, నేతలు భారీగా చేరుకున్నారు. బండారు ఆరోగ్య పరిస్థితి బాగోలేదంటూ పోలీసులను కార్యకర్తలు అడ్డుకున్నారు. బీపీ, షుగర్ లేవెల్స్ పెరగడంతో ఆర్కే హాస్పిటల్ కు తరలించాలని టీడీపీ కార్యకర్తలు డిమాండ్ చేశారు. 65 ఏళ్ల వయసు ఉన్న బండారు సత్యనారాయణకు 41ఏ నోటీస్ ఇవ్వాలని పోలీసులు ప్రయత్నించారు.
ఉద్రిక్తతల మధ్య బండారు ఇంట్లోకి వెళ్లారు పోలీసులు. మరికొద్దిసేపట్లో బండారు సత్యనారాయణను పోలీసులు అరెస్టు చేయనున్నారు. బండారు సత్యనారాయణ మూర్తి ఇటీవల రాష్ట్ర పర్యటకశాఖ మంత్రి రోజాపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారని రాష్ట్ర మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్ వాసిరెడ్డి పద్మ డీజీపీకి లేఖ రాసిన విషయం తెలిసిందే. ఈ విషయంలో కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని పద్మ లేఖలో డీజీపీని కోరారు. అందుకే విశాఖపట్నంలోని పరవాడ డీఎస్పీ కేవీ సత్యనారాయణ, సీఐ ఈశ్వరరావు గత అర్ధరాత్రి వేళ భారీ పోలీసు బలగాలతో బండారు నివాసానికి చేరుకున్నారు.