చంద్రబాబు అరెస్టుపై సిని మావాళ్లు స్పందించకపోవడాన్ని తాను పట్టించుకోనని, జూనియర్ ఎన్టీఆర్ స్పందించకపోయినా ఐ డోంట్ కేర్ అని హిందూపురం ఎమ్మెల్యే, టీడీపీ నేత బాలకృష్ణ విమర్శించారు. అయితే నందమూరి వంశంలో తొలి తరం వారసుడు బాలయ్య మలితరం వారసుడు జూనియర్ ఎన్టీయార్ కి ఇండైరెక్ట్ గా పంచ్ ఇచ్చేశారు. తెలంగాణా పార్టీ ఆఫీసులో ఆయన మీడియాతో మాట్లాడుతున్నప్పుడు చంద్రబాబు అరెస్ట్ మీద జూనియర్ ఎన్టీయార్ ఎందుకు రియాక్ట్ కాలేదన్న ప్రశ్న ఎదురైంది. దానికి బాలయ్య తనదైన సినీ ఫక్కీలో ఆన్సర్ ఇచ్చారు. ఐ డోంట్ కేర్ బ్రో ఇది నా నెక్స్ట్ సినిమా.
సినిమాయే కాదు బయట కూడా అంటూ చిత్రమైన సమాధానం చెప్పారు. జూనియర్ స్పందించకపోయినా లేకపోతే సినిమా జనాలు రియాక్ట్ కాకపోయినా ఐ డోంట్ కేర్ అంటూ బాలయ్య ఇచ్చి పడేశారు. ఒక విధంగా ఆయన టీడీపీతో జూనియర్ రిలేషన్స్ మీద ఒక సంకేతం ఇచ్చేశారు అనుకోవాలి. జూనియర్ తో దూరం అలాగే ఉందని కూడా చెప్పకనే చెప్పారా అన్న చర్చ నడుస్తోంది. జూనియర్ ఎన్టీయార్ చంద్రబాబుతో ఎపుడూ అంటీ ముట్టనట్లుగానే ఉంటున్నారు. జూనియర్ చంద్రబాబుతో వేదిక పంచుకున్నది చివరిసారిగా 2011లో మాత్రమే. అంటే ఒక మహానాడులో వేదిక మీద ఆయన తన మామయ్యతో కనిపించారు. ఆ తరువాత మళ్లీ జూనియర్ ఎక్కడా చంద్రబాబుతో కనిపించలేదు.
ఇక బాలయ్యతో ఆయన కనిపించినది చూస్తే కధానాయకుడు సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో అని చెప్పుకోవాలి. ఇది జరిగి కూడా అయిదేళ్ళు కావస్తోంది. మరో వైపు చూస్తే జూనియర్ ఎక్కడా టీడీపీ రాజకీయాల్లో కనిపించడంలేదు. స్టేట్మెంట్స్ కూడా ఇవ్వడంలేదు. 2019 ఎన్నికల్లో సైతం ఆయన అయిపూ అజా లేదు. ఇక చంద్రబాబు అరెస్ట్ మీద జూనియర్ స్పందించకపోవడం ఒక వర్గానికి అయితే ఆశ్చర్యం లేదు. అదే టైం లో మరో వర్గానికి మాత్రం అది కన్నెర్ర అవుతోంది. ఒక వైపు బాబు అరెస్ట్ మీద చర్చ సాగుతూంటే సమాంతరంగా జూనియర్ ఎందుకు నోరు విప్పడంలేదు అన్న చర్చ కూడా నడుస్తోంది.