టీడీపీ అధినేత చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్ పై ఏపీ హైకోర్టులో విచారణ వాయిదా పడింది.అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో చంద్రబాబుకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ ఆయన తరపు న్యాయవాదులు న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ కేసులో చంద్రబాబు బయటకు వస్తారని టిడిపి శ్రేణులు ఆశగా ఎదురుచూశాయి. తీర్పు రిజర్వ్ చేయడంతో నీరుగారిపోయాయి. ఇప్పటికీ తీర్పు అనుకూలంగా వస్తుందని ఆశాభావంతో ఉన్నాయి.
చంద్రబాబు తరఫున సిద్ధార్థ్ లూథ్ర, హరీష్ సాల్వేలు గట్టిగానే వాదనలు వినిపించారు. ఇది పూర్తిగా రాజకీయ కక్షతో పెట్టిన కేసు అని.. కొట్టేయాలని కోరారు. సిఐడి తరఫున వర్చువల్గా సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీ వాదనలు వినిపించారు. అన్ని ఆధారాలతోనే చంద్రబాబును అరెస్టు చేసిన విషయాన్ని గుర్తించారు. చంద్రబాబుకు బెయిల్ ఇస్తే.. కేసును ప్రభావితం చేసే అవకాశం ఉందని అడిషనల్ అడ్వకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి న్యాయమూర్తి ముందు చెప్పుకొచ్చారు. అసలు క్వాష్ పిటిషన్ వేయడానికి చంద్రబాబు అనర్హుడని అన్నారు.మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభమైన వాదనలు సాయంత్రం ఐదు గంటల వరకు కొనసాగాయి.
ఇరు వర్గాల వాదనలు విన్న న్యాయస్థానం తీర్పును రిజర్వ్ చేసింది. దీంతో మరింత ఉత్కంఠ పెరిగింది. క్వాష్ పిటిషన్ కనుక హైకోర్టు సమర్థిస్తే చంద్రబాబు ఏ బెయిల్ అవసరం లేకుండానే రిలీజ్ అవుతారు. అలా కాకుండా ఆ పిటిషన్ ను కోర్టు కొట్టేస్తే మాత్రం ఏసీబీ కోర్టుకు బెయిల్ కు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. మరోవైపు ఏసీబీ కోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ వేసిన సంగతి తెలిసిందే. దానిపై విచారణ బుధవారం నాటికి వాయిదా పడింది. క్వాష్ పిటిషన్ పై తీర్పు రిజర్వులో పెట్టడంతో.. నేటి బెయిల్ పిటిషన్ విచారణ సైతం ఏసీబీ కోర్టు వాయిదా వేసే అవకాశాలు ఉన్నాయి.