రేవంత్ రెడ్డి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి కొత్త ఉత్సహాన్ని తీసుకురావడంలో విజయం సాధించారని ఆ పార్టీలోని కొందరు నాయకులు అంటున్నారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ విజయానికి శక్తివంచనలేకుండా ప్రచారం చేసిన, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు నాయకత్వం వహించిన రేవంత్ రెడ్డి హైకమాండ్ లో మంచి గుర్తింపు తెచ్చుకున్నట్లు కనిపిస్తోంది.
బీఆర్‌ఎస్ కంచుకోట అయిన కామారెడ్డిలో ముఖ్యమంత్రి, భారత రాష్ట్ర సమితి జాతీయ అధ్యక్షుడు కే చంద్రశేఖర్ రావుపై రేవంత్ రెడ్డి పోటీ చేసి హాట్ టాపిక్ అయ్యారు. నారా చంద్రబాబు నాయుడు శిష్యుడిగా తెలుగుదేశం పార్టీ నుండి రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన రేవంత్ రెడ్డి తెలంగాణ రాజకీయాల్లో ఎప్పుడు వార్తల్లో ఉండేవాడు.
తెలుగుదేశం పార్టీ నుంచి బయటకు వచ్చిన రేవంత్ రెడ్డి 2017లో కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. సొంత పార్టీలో వ్యతిరేకించి నిరసనలు తెలిపినప్పటికి కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ అండతో రేవంత్ రెడ్డి వెనుకా ముందు ఆలోచించకుండా పక్కాప్లాన్ తో కేసీఆర్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేశారు. కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకులతో నిత్యం టచ్ లో ఉన్న రేవంత్ రెడ్డి ఆ పార్టీలో గుర్తింపు తెచ్చుకున్నాడు.