ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో అరెస్ట్ అయి రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్న చంద్రబాబుకు మరోసారి నిరాశ ఎందురైంది. రిమాండ్ ఖైదీ చంద్రబాబును ఇతర కేసులు కూడా వెంటాడుతున్నాయి. అన్నమయ్య జిల్లా ప్రాజెక్టు పర్యటన సందర్భంగా జరిగిన హింసాత్మక ఘటనల్లో చంద్రబాబుపై కేసు నమోదైంది. అయితే చంద్రబాబును రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించడం ఆయనకు హౌస్ అరెస్ట్ సదుపాయం కల్పించమని ఆయన తరఫు న్యాయవాదులు కోర్టును ఆశ్రయించడం చకచకా జరిగిపోయాయి.
చంద్రబాబునాయుడు లాయర్ల తరఫున వాదనలు విన్న కోర్టు తీర్పును మంగళవారానికి వాయిదా వేసింది. అత్యంత నాటకీయ పరిణామాల మధ్య కొనసాగుతున్న చంద్రబాబు నాయుడి అరెస్ట్ వ్యవహారం తో రాష్ట్ర వ్యాప్తంగా తెలుగు దేశం పార్టీ శ్రేణులు డీలా పడ్డారు. ఇన్నేళ్ళ రాజకీయ జీవితం లో మచ్చలేకుండా బ్రతికిన తమ నాయకుడి పై కేవలం వ్యక్తిగత కక్ష్య సాధింపులో భాగంగానే జైలుకు పంపించారని వారు ఆరోపిస్తున్నారు.
చంద్రబాబు అరెస్ట్ కు నిరసనగా తెదేపా రాష్ట్రవ్యాప్తంగా బంద్ కు పిలుపునిచ్చినప్పటికీ బంద్ పెద్దగా విజయవంతం కాలేదనే వాదనలు వినిపిస్తున్నాయి. ఐతే తమ నాయకులను ముందస్తు అరెస్టుల పేరు తో గృహనిర్భంధాలు చేసి పోలీసులు బంద్ ను విఫలం చేయటానికి ప్రయత్నించారని , అయినప్పటికీ తాము బంద్ ను సంపూర్ణంగా విజయవంతం చేశామని తెదేపా శ్రేణులు తెలియజేస్తున్నాయి.