దేశ వ్యాప్తంగా పది రోజుల నుంచే ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. అటు దేశంలో లోక్‌సభ, ఏపీలో అయితే ఒకేసారి అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో కోడ్‌ను మరింత పటిష్టంగా అమలు చేయాలని కేంద్ర, రాష్ట్ర ఎన్నికల సంఘాలు ప్రకటించాయి. కానీ వైసీపీ ప్రభుత్వం మాత్రం ‘కోడ్ మీకే కానీ మాకు కాదు..!’ అన్నట్లుగా వ్యవహరిస్తోంది. రాష్ట్ర సర్కార్ ఆధీనంలోని సైబర్ నెట్‌లో యధేచ్ఛగా ప్రభుత్వ సంక్షేమ పథకాలను ఊదరగొడుతోంది.
సీఎం జగన్ ఫోటోలు, ఆయన విద్వేషపూరిత ప్రసంగాలను ప్రచారం చేస్తూ ఓటర్లను ప్రభావితం చేసేలా వ్యవహరిస్తోంది. మరోవైపు సోషల్ మీడియాలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి గత వీడియోలతో ఓటర్లను ఆకట్టుకునే యత్నం చేస్తోంది. గతంలో శ్మశానాలకు సైతం వైసీపీ రంగులు వేసిన ప్రభుత్వం ఇప్పుడు వాటిని తొలగించేందుకు ససేమిరా అంటోంది.
అధికారులు సైతం వైసీపీ రంగులు, పోస్టర్ల జోలికి వెళ్లడం లేదు.
ప్రతిపక్షాలు ఏమైనా పోస్టర్లు అంటిస్తే మాత్రం వాటిని తొలగించే వరకూ వదలడం లేదు. రాష్ట్రమంతా ఇదే పరిస్థితి ఉంటే కడప జిల్లా అందునా స్వయానా సీఎం జగన్ సొంత ఇలాఖ అయిన పులివెందుల పరిస్థితి ఎలా ఉంటుందనేది ప్రత్యేకంగా చెప్పాలా? అక్కడ వైసీపీ నేతలు చేసిందే శాసనం. కోడ్ నై.. గీడ్ నై అంటున్నారు. ప్రతిపక్షాలకే కానీ ఈ కోడ్‌లు తమకు కాదంటున్నట్టుగా వ్యవహరిస్తున్నారు.