సీఎంగా చంద్రబాబు ప్రమాణ స్వీకారోత్సవానికి చిరంజీవికి విశేషమైన ఆహ్వానం దక్కింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విశిష్ట అతిథిగా ఆయనకు ఆహ్వానం అందింది. ఆయన ఈ కార్యక్రమానికి హాజరుకానున్నారు. ఇందుకే నేటి సాయంత్రమే ప్రత్యేక విమానంలో విజయవాడకు వెళ్లనున్నారు. రేపు ఉదయం ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి వెళతారు.
చిరంజీవితో పాటు ఆయన తనయుడు, మెగా పవర్ స్టార్ రామ్‍చరణ్ కూడా ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరుకానున్నారు. ఇందుకోసం షెడ్యూల్ కూడా ఖరారు చేసుకున్నారని తెలుస్తోంది. చిరంజీవి సోదరుడు, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఈ ఎన్నికల్లో పిఠాపురం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. జనసేన పోటీ చేసిన 21 స్థానాల్లో అన్ని చోట్ల గెలిచింది.
అయితే, పవన్ కల్యాణ్ మంత్రి పదవి తీసుకుంటారా.. రేపు ప్రమాణ స్వీకారం చేస్తారా అనేదే ఇప్పుడు అందరిలోనూ ఉత్కంఠ నెలకొంది. చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కూడా హాజరుకానున్నారు. ఈ కార్యక్రమానికి భారీ స్థాయిలో బందోబస్తు చేస్తున్నారు పోలీసులు. వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కొందరు కేంద్ర మంత్రులతో పాటు వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు.