ఓ నటుడు అనుమానాస్పద స్థితిలో మరణించాడు. పలు సినిమాల్లో సహాయకపాత్రలో నటించిన మోహన్ కన్నుమూశారు. ఆయన మృతదేహం రోడ్డు పక్కన లభించిందని పోలీసులు తెలిపారు. తమిళనాడులోని మధురై జిల్లా తిరుప్పాంగుండ్రం రోడ్డు పక్కన ఒక మృతదేహం ఉందని పోలీసులకు సమాచారం అందిచారు స్థానికులు. అయితే మరుగుజ్జు అయిన మోహన్ యంగ్ ఏజ్ లోనే సినీ పరిశ్రమకు వచ్చాడు. చాలా సినిమాల్లో మరుగుజ్జు పాత్రల్లో నటించాడు. కమల్ హాసన్ మరుగుజ్జుగా నటించిన ‘విచిత్ర సోదరులు’ సినిమాలో కమల్ హాసన్ స్నేహితుల్లో ఒకడిగా నటించాడు మోహన్.
ఆ సమయంలో మోహన్ కమల్ హాసన్ కి క్లోజ్ అయ్యాడు. 1989లో వచ్చిన విచిత్ర సోదరులు సినిమా మంచి విజయం సాధించింది. కమల్ హాసన్ కూడా కొన్నాళ్ళు మోహన్ ని గుర్తించారు. అతనితో సన్నిహితంగా మెలిగారు. దీంతో మోహన్ కు కూడా మంచి గుర్తింపు వచ్చి పలు సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు వచ్చాయి. చివరిసారిగా 2009లో నేనే దేవుడ్ని అనే సినిమాలో కొంచెం గుర్తింపు వచ్చే పాత్ర వేశాడు మోహన్. ఆ తర్వాత కొన్నాళ్ళు గ్యాప్ ఇచ్చినా సేలంలో ఉండే మోహన్ కొన్నాళ్ల క్రితం మళ్ళీ సినిమాలు అంటూ బయటకి వచ్చాడు.

అవకాశాలు ఏమి రాకపోవడంతో, ఆదాయం కూడా లేకపోవడంతో ఇంటికి వెళ్లడం ఇష్టం లేక మధురైలో భిక్షాటన చేస్తున్నట్టు సమాచారం. ఇప్పుడు ఇలా శవమై రోడ్డు పక్కన కనిపించడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ప్రాధమిక విచారణలో అతను రోడ్లపై భిక్షాటన చేస్తూ, అనారోగ్యం, పేదరికం సమస్యల వల్లే మరణించాడని తెలుస్తుంది. కమల్ హాసన్ లాంటి స్టార్ హీరోతో నటించి, ఎన్నో సినిమాల్లో నటించిన మోహన్ ఇలా 60 ఏళ్ళ వయసులో రోడ్డు పక్కన పేదరికం, అనారోగ్యంతో అర్దాంతరంగా మరణించడం పలువురి మనసులని కలిచివేస్తుంది.
