చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దల వరకు కూడా అటు సడన్ హార్ట్ ఎటాకుల బారిన పడుతూ చివరికి ప్రాణాలు కోల్పోతున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయ్. అయితే ఇలా సడన్ హార్ట్ ఎటాక్ లు ఎందుకు వస్తున్నాయి అన్నదానికి ఇప్పటికీ ఒక కారణమే లేకుండా పోయింది. అయితే కరీంనగర్ జిల్లాలో ఓ షాకింగ్ ఘటన వెలుగు చూసింది.
కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న ఓ విద్యార్థిని కళాశాలలో జరుగుతున్న ఓ కార్యక్రమంలో డ్యాన్స్ చేస్తూ గుండెపోటుకు గురై ఒక్కసారిగా కుప్పకూలింది. వివరాల్లోకి వెళితే జిల్లాలోని గంగాధర మండలం వెంకటాయపల్లికి చెందిన గుండు అంజయ్య, శారదల కుమార్తె ప్రదీప్తి ఆదర్శ పాఠశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్నారు. ఆమెకు చిన్నప్పటి నుంచి గుండెలో రంధ్రం ఉండేది.

వైద్యులు ఆపరేషన్ చేయాలని తల్లిదండ్రులకు సూచించినప్పటికీ వారు భరించలేకపోయారు. కాగా, శుక్రవారం కళాశాలలో ఫ్రెషర్స్ డే నిర్వహించారు. ఈ క్రమంలో ప్రదీప్తి తన తోటి విద్యార్థులతో కలిసి డ్యాన్స్ చేస్తుండగా ఒక్కసారిగా కుప్పకూలింది. కళాశాల వైద్యులు ఆమెకు సీపీఆర్ చేసినా ఫలితం లేకపోవడంతో వెంటనే కరీంనగర్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అప్పటికే బాలిక మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు. మొదటి బిడ్డను పోగొట్టుకున్న తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు.