వేర్వేరు ఫ్లాట్ ఫామ్స్ పై విచిత్రమైన ట్రోల్స్, సెలబ్రిటీలకు సంబంధించిన వీడియోలపై అగ్లీ కామెంట్స్ చేస్తూ వీడియోలను రూపొందిస్తూ ఫేమస్ అయ్యాడు ప్రణీత్ హనుమంతు. ఇప్పటి వరకు ఈ యూట్యూబర్ చేసిన వీడియోల సంగతి పక్కన పెడితే కొద్ది రోజుల క్రితం తండ్రి, కూతుళ్ల రిలేషన్ పై అసభ్యకరంగా వీడియో చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్ట్ చేసి వివాదాల్లో చిక్కుకున్నాడు.
అయితే తండ్రీ కూతుళ్ల బంధంపై తప్పుడు వ్యాఖ్యలు చేసి ప్రణీత్ హనుమంతు పెద్దఎత్తున చర్చకు తెరలేపిన విషయం తెలిసిందే. కామన్ మ్యాన్ దగ్గరి నుంచి సెలబ్రిటీల వరకు అంతా వారిని అరెస్టు చేయాలని.. కఠిన శిక్ష విధించాలి అని డిమాండ్ చేస్తున్నారు. ఇప్పడు ఆ కేసుకు సంబంధించి పోలీసులు ప్రణీత్ హనుమంతును అరెస్టు చేశారు. బెంగళూరులో ఉన్న ప్రణీత్ హనుమంతును అదుపులోకి తీసుకున్నారు.
ప్రణీత్ సహా మరో ముగ్గురిపై సైబర్ క్రైమ్ పోలీసులు కేసులు కూడా నమోదు చేశారు. మొదట ప్రణీత్ హనుమంతును బెంగళూరు కోర్టులో హాజరు పరుస్తారు. ఆ తర్వాత ట్రాన్సిట్ వారెంట్ పై అతడిని హైదరాబాద్ తీసుకురానున్నారు. మిగిలిన ముగ్గురిని కూడా పట్టుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.