దాదాపు రూ.500 కోట్ల ప్రజాధనంతో అప్పటి సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రుషికొండలో భవనాలను నిర్మించారు. అయితే అందులో ఏం నిర్మించారు అనేది ఆదివారం వరకు బయటి ప్రపంచానికి తెలియదు. రుషికొండలో వైసీపీ సర్కార్ నిర్మించిన ప్యాలెస్ లాంటి భవనాల వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో టాక్ ఆఫ్ ది టౌన్ గా మారాయి.
రుషికొండలో నిర్మించిన ఈ భవనాలను ముందు పర్యాటకం కోసం నిర్మించినట్లు వైసీపీ చెప్పగా, తాజాగా ఇవి పరిపాలన భవనాలు అని వైసీపీ నేతలు చెబుతున్నారు. వైసీపీ ప్రభుత్వం, మాజీ సీఎం జగన్ రుషికొండపై అక్రమంగా నిర్మించిన రాజ్‌మహల్ రహస్యంపై రాష్ట్ర వ్యాప్తంగా ఆసక్తిగా ఉన్నారని గంటా శ్రీనివాసరావు పేర్కొన్నారు. జగన్ నిర్మించిన ఈ ప్యాలెస్ లాంటి భవనాలను ముఖ్యమంత్రి చంద్రబాబుకు చూపిస్తాం, ఆయన ప్రభుత్వం వీటిపై నిర్ణయం తీసుకుంటుందన్నారు.
టీడీపీ హయాంలో నిర్మించిన ప్రజావేదికను అనుమతులు లేవని కూల్చారని, ఇప్పుడు ఏ అనుమతులతో రుషికొండపై భారీ నిర్మాణాలు చేపట్టారని ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. రుషికొండలో నిర్మించినవి ప్రభుత్వ భవనాలే అని, అవేమీ ప్రైవేటు ఆస్తులు కావని వైసీపీ నేతలు టీడీపీ ఆరోపణలపై స్పందిస్తున్నారు. రుషికొండలో నిర్మాణాలు ఎవరికీ సొంతంకూడా కాదన్నారు.