ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దంపతులకు విజయవాడ నటరాజ నృత్యాలయం నాట్యాచార్య రాయన శ్రీనివాసరావు శిష్య బృందం నృత్యం చేస్తూ గురువారం ఘన స్వాగతం పలికింది. నృత్యకారిణులను చంద్రబాబు అభినందించారు. అయితే పాలనకు సమయం ఇస్తూనే టీడీపీకి సైతం టైం కేటాయించాలనే ఆలోచనలో సీఎం చంద్రబాబు ఉన్నారు.
ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం రెండు రోజుల పాటు చంద్రబాబు సచివాలయానికి వెళ్లారు. ఈ రోజు తొలిసారి టీడీపీ కార్యాలయానికి అధినేత చంద్రబాబు నాయుడు వెళ్లనున్నారు. పాలన వ్యవహారాల్లో ఎంత బిజీగా ఉన్నా.. పార్టీ కార్యకర్తలు, నాయకులకు సమయం ఇవ్వాలనుకుంటున్నారు. స్వయంగా పార్టీకి సమయం వెచ్చించడం ద్వారా ఇదే విధానాన్ని పాటించాలని ఎమ్మెల్యేలు, మంత్రులకు చంద్రబాబు మెసేజ్ ఇవ్వనున్నారు.
2014 లో గెలిచిన తరువాత పాలనా వ్యవహారాల్లో పడి పార్టీకి చంద్రబాబు సమయం కేటాయించలేపోయారు. ఈ సారి నిర్థిష్ట సమయం పెట్టుకుని పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనాలనే ఆలోచనలో ఆయన ఉన్నారు. పని చేసిన వారికే పదవులు అనే విషయంలో కూడా స్పష్టతతో ఉన్నారు. ఇకపై కార్యకర్తలకు, నాయకులకు గౌరవం దక్కేలా తీసుకోవాల్సిన చర్యలపై టీడీపీ అధినేత చంద్రబాబు ఫోకస్ పెట్టారు.