ఉగాది వస్తోందంటే చాలు వేప పచ్చడీ, పంచాంగ శ్రవణమే గుర్తుకుస్తాయి. మరి ఉగాది అంటే ఇంతేనా! ఆ రోజు పూజించేందుకు ప్రత్యేకమైన దైవం కానీ, ఆచరించాల్సిన విధులు కానీ లేవా అంటే లేకేం… అయితే తెలుగువారికి కొత్త సంవత్సరం ఉగాదితో ప్రారంభమవుతుంది. వారికి ఇది మొదటి పండగ. ప్రతి సంవత్సరం చైత్ర శుద్ద పాడ్యమినే ఉగాదిగా పేర్కొంటారు.
ఆరోజే బ్రహ్మదేవుడు సమస్త సృష్టిని ప్రారంభించాడని పురాణాల్లో ఉంది. విష్ణుమూర్తి మత్స్యావతారాన్ని ధరించి సోమకుణ్ని సంహరించి వేదాలను రక్షించింది కూడా ఉగాది రోజే. అంతేకాదు.. శాలివాహనుడు పట్టాభిషిక్తుడైంది కూడా ఉగాదిరోజే… పురాణాలు, ఇతిహాసాల ప్రకారం ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉదాహరణలు కనిపిస్తాయి. ఉగాది పేరు వినగానే మనకు అచ్చమైన ప్రకృతి పండగ గుర్తొస్తుంది.
మోడువారిన చెట్లు చిగురిస్తూ, పూల పరిమళాలతో గుబాళిస్తూ పుడమితల్లిని పులకింపచేసే వసంతరుతువు కూడా చైత్రశుద్ధ పాడ్యమి నుంచే మొదలవుతుంది. అందుకే ఉగాదిని కొత్తదనానికి నాందిగా, కొత్త పనులు చేయడానికి ప్రారంభరోజుగా అభివర్ణిస్తారు.