రాష్ట్రవ్యాప్తంగా 41 నుంచి 43 డిగ్రీల మధ్య గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. రెండు రోజులపాటు రాష్ర్టానికి తీవ్రమైన ఎండలతోపాటు వడగాల్పుల హెచ్చరికలను ఐఎండీ జారీచేసింది. ఉదయం 11 నుంచి సాయంత్రం 4 వరకు ప్రజలు బయటకు రావద్దని హెచ్చరించింది. అయితే తెలంగాణలో ఎండలతో తొమ్మిది జిల్లాలు అతలాకుతలం అవుతున్నాయి. 34 మండలాల్లో రికార్డుస్థాయిలో వడగాలులు వీసే అవకాశం ఉందని వాతావరణ విభాగం అంచనా వేస్తోంది.
ముఖ్యంగా ఉమ్మడి నల్గొండ, ఖమ్మం జిల్లాలో ఉష్ణోగ్రతలు గత ఏడాది కన్నా మూడున్నర డిగ్రీలు ఎక్కువగా నమోదు అవుతున్నాయి. ఇక ఆంధ్రప్రదేశ్‌లోని ఐదు ఉమ్మడి జిల్లాల్లో, అంటే ఉమ్మడి విజయనగరం, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో వడగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ విభాగం చెబుతోంది. జిల్లాల వారీగా చూస్తే శ్రీకాకుళంలోని 6 మండలాల్లో వడగాలులు దడ పుట్టిస్తాయని చెబుతున్నారు.
విజయనగరంలో 20, పార్వతీపురం మన్యంలో 8, అనకాపల్లిలో 11, కాకినాడలో 6, కోనసీమలో 4, ఏలూరులో 4, ఎన్టీఆర్ జిల్లాలో 2, గుంటూరులో 7, పల్నాడులో 2, తూర్పుగోదావరిలో 15 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉంది. నిన్న నంద్యాల జిల్లా చాగల మర్రి, నెల్లూరు జిల్లా కలిగిరిలో అత్యధికంగా 45.8 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
వైయస్సార్ జిల్లా ఖాజీపేట, సింహాద్రిపురంలో 45.6 డిగ్రీలు, బాపట్ల జిల్లా జనకవరం పంగులూరులో 45.5 డిగ్రీలు, కర్నూలు జిల్లా ఆలూరు, ప్రకాశం జిల్లా బోట్లగూడూరులో 45.4 డిగ్రీలు, పల్నాడు జిల్లా విజయపురి లో 45.2 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. దాదాపు 107 మండలాల్లో తీవ్ర వడగాల్పుల ప్రభావం కనిపించింది.