సానియా భర్త, పాకిస్థాన్ క్రికెట్ స్టార్ షోయబ్ మాలిక్ మరో పెళ్లి చేసుకున్నాడు. సానియా మీర్జాతో విడిపోయారనే ఊహాగానాలు వినిపిస్తున్న తరుణంలో పాకిస్థాన్ నటి సనా జావేద్‌ను పెళ్లి చేసుకున్న ఫొటోలను షోయబ్ షేర్ చేశారు. అయితే అయేషా సిద్దిఖీకి విడాకులు ఇచ్చిన షోయబ్ 2010లో సానియాను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. వీరికి ఓ కొడుకు కూడా ఉన్నాడు. గత రెండేళ్లుగా షోయబ్, సానియా విడాకుల గురించి వార్తలు వస్తూనే ఉన్నాయి.
అయితే ఆ వార్తలపై వీరిద్దరూ స్పందించలేదు. గత ఏడాది సనా జావేద్‌కు బర్త్ డే విషెస్ చెబుతూ ఆమెతో సన్నిహితంగా ఉన్న ఫొటోను షోయబ్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. అప్పట్నుంచి షోయబ్, సనా డేటింగ్‌పై వార్తలు మొదలయ్యాయి. కాగా, గత బుధవారం తమ విడాకుల గురించి సానియా సోషల్ మీడియా ద్వారా కామెంట్ చేసిన సంగతి తెలిసిందే. “`పెళ్లి కఠినమైనది, విడాకులు తీసుకోవడం కూడా కఠినమే… ఇందులో నీకు నచ్చిన కఠినమైన అంశాన్ని ఎంచుకో. స్థూలకాయం కష్టం, ఫిట్ గా ఉండడం కష్టం… నీకు నచ్చిన కష్టాన్ని ఎంచుకో.
అప్పులు చేయడం కష్టం, ఆర్థిక క్రమశిక్షణతో ఉండడం కష్టం.. నీకు నచ్చిన కష్టాన్ని ఎంచుకో. భావవ్యక్తీకరణ కష్టం, భావాలను వ్యక్తీకరించకపోవడం కష్టం.. నీకు నచ్చిన కష్టాన్ని ఎంచుకో. జీవితం ఎల్లప్పుడూ పూలపాన్పులా ఉండదు, అది కఠినంగా కూడా ఉంటుంది. కానీ మనకు నచ్చిన కష్టాన్ని ఎంచుకునే వెసులుబాటు మనకు ఉంటుంది. ఆ కష్టాన్ని తెలివిగా ఎంచుకోవాల్సి ఉంటుంది“ అంటూ సానియా పేర్కొంది.