రెండేళ్లుగా అన్నతో విభేదించి తెలంగాణకు వెళ్లిపోయి అక్కడ వైఎస్సార్టీపీ పార్టీ పెట్టినా ఎన్నికల్లో పోటీ చేయకుండా కాంగ్రెస్ కు మద్దతిచ్చి అనంతరం ఆ పార్టీలో చేరిపోయిన వైఎస్ షర్మిల త్వరలో తన కుమారుడు రాజారెడ్డికి అట్లూరి ప్రియతో కులాంతర వివాహం జరిపించబోతున్నారు. ఈ పెళ్లితో పాటు నిశ్చితార్ధానికి కూడా రావాలని పలువురిని ఆహ్వానిస్తున్నారు.
తొలికార్డు తండ్రి సమాధి వద్ద పెట్టిన షర్మిల.. రెండోది అన్న జగన్ కు తీసుకెళ్లి ఇచ్చారు. దీనిపై ఆయనేమన్నారో తెలియదు. అనంతరం తాజాగా వైఎస్ షర్మిల వరుసపెట్టి జగన్ కు ప్రత్యర్ధులుగా ఉన్న వారిని కలుస్తున్నారు. ఈ క్రమంలో ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి వంటి వారు ఉన్నారు.
అలాగే ఇప్పటికే జగన్ కు రాజకీయంగా బద్ధశత్రువైన నారా లోకేష్ కు క్రిస్మస్ గ్రీటింగ్స్, గిఫ్ట్ పంపిన షర్మిల.. ఇప్పుడు చంద్రబాబుతో పాటు లోకేష్ ను పిలిచేందుకు సిద్ధమవుతున్నారు. అది కూడా జరిగితే ఒకే వేదికపై వీరంతా కనిపించక తప్పదు. అలా జరుగుతుందా.. జరిగితే తర్వాత ఏం జరగబోతోందన్నది ఇప్పుడు చర్చనీయాంశమవుతోంది.