అదృష్టం అంటే కొంతమందికి చాలా నమ్మకం. ఒక వ్యక్తి యొక్క ఊహను మించి జరిగే నమ్మలేని నిజాల్ని మంచిదైతే అదృష్టంగా భావిస్తారు. అయితే ఇలాగే చెడు జరిగినప్పుడు దురదృష్టం అంటారు. లాటరీలు, జూదం మొదలైన అదృష్టాల్ని నమ్మేవాళ్ళని చేతకాని వారిగా కొందరు భావిస్తారు. అయితే అదృష్టం ఎప్పుడు ఎవర్ని ఎలా వరిస్తుందో చెప్పలేం. కష్టపడి పనిచేస్తే కానీ కడుపునిండని కడు పేదను కూడా కోటీశ్వరుడ్ని చేస్తుంది.
తాజాగా అలాంటి సంఘటనే ఒకటి అమెరికాలో చోటుచేసుకుంది. పొలం దున్నుతున్న ఓ రైతు నాగలికి భూమిలో ఏదో తగిలింది. ఏదో రాయి అడ్డుకుందనుకుని రైతు దానిని తొలగించే ప్రయత్నం చేసాడు. తీరా చూస్తే అదొక పెట్టె. అది చాలా బరువుగా ఉంది. ఏమై ఉంటుందా అని రైతు దానిని ఓపెన్ చేసి చూసి ఒక్కసారిగా షాకయ్యాడు. ఎందుకంటే ఆ పెట్టెనిండా బంగారు, వెండి నాణేలు ఉన్నాయి మరి.
ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్గా మారింది. అమెరికాలోని కెంటుకీ రాష్ట్రంలో ఓ రైతు తన పొలంలో పనిచేస్తుండగా ఈ నాణేల పెట్టె దొరికింది. మట్టికొట్టుకుపోయి ఉనన ఆ నాణేలను కొన్ని చేతుల్లోకి తీసుకుని కడిగాడు. అవి దగదగా మెరిసిపోతూ కనిపించాయి. దీంతో అతని ఆనందానికి అవధుల్లేకుండా పోయింది. ఈ నాణేలు అన్నీ 1840-1863 కాలానికి చెందినవిగా తెలిశాయి.